సినీ ఫ‌క్కీలో రియ‌ల్ట‌ర్ కిడ్నాప్‌..

Realtor kidnaped in Nirmal District.నిర్మ‌ల్ జిల్లాలో కిడ్నాప్ క‌ల‌క‌లం రేపింది. సినీ ఫ‌క్కిలో ఓ రియల్టర్‌ కిడ్నాప్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  8 Aug 2021 12:54 PM IST
సినీ ఫ‌క్కీలో రియ‌ల్ట‌ర్ కిడ్నాప్‌..

నిర్మ‌ల్ జిల్లాలో కిడ్నాప్ క‌ల‌క‌లం రేపింది. సినీ ఫ‌క్కిలో ఓ రియల్టర్‌ కిడ్నాప్‌ జరిగింది. ప‌ట్ట‌ణంలోని దివ్యాన‌గ‌ర్‌లోని త‌న్వి అపార్టుమెంట్‌లో రియ‌ల్ట‌ర్ విజ‌య్ చంద‌ర్ దేశ్ పాండే నివాసం ఉంటున్నాడు. ఆదివారం ఉద‌యం 7 గంటల ప్రాంతంలో రెండు కార్ల‌లో వ‌చ్చిన గుర్తు తెలియ‌ని ఆరుగురు దుండ‌గులు ఆయ‌న్ను కిడ్నాప్ చేశారు. లిప్ట్ నుంచి బ‌ల‌వంతంగా లాక్కొని కిందికి తీసుకుని వ‌చ్చి అప‌హ‌రించిన దృశ్యాలు సీసీటీవీ లో రికార్డు అయ్యాయి. స్థానికులు వారిని అడ్డుకునేందుకు య‌త్నించ‌గా.. వారిని బెదిరించిన‌ట్లు తెలుస్తోంది.

విజ‌య్ చంద‌ర్ దేశ్ పాండే కిడ్నాప్ పై కుటుంబ స‌భ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికులు తెలిసిన వివ‌రాల మేర‌కు నిందితులు హైద‌రాబాద్ వైపు వెళ్లిన‌ట్లు గుర్తించారు. ఆ మార్గంలోని పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు త‌నిఖీలు చేప‌ట్ట‌గా.. ఇంద‌ల్వాయి టోల్ ఫ్లాజా వ‌ద్ద ఒక వాహ‌నాన్ని.. తూఫ్రాన్ వ‌ద్ద మరో వాహ‌నాన్ని ప‌ట్టుకున్నారు. కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. రియల్టర్‌ విజయ్‌ దేశ్‌పాండే క్షేమంగా ఉన్నట్లు కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.

రియల్టర్‌ లావాదేవీలు, భూముల కొనుగోలు వ్యవహారమే కిడ్నాప్‌కు కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రియల్టర్‌ విజయ్‌ దేశ్‌పాండే సంగారెడ్డిలో రెండు నెలల క్రితం 2 కోట్ల విలువ చేసే భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమి లావాదేవీల విషయంలో వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలోనే కిడ్నాప్‌కు గురైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Next Story