భువనగిరిలో దారుణం..మార్చురీలో మృతదేహాన్ని కొరికిన ఎలుకలు
భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. మార్చురీలో ఉంచిన మృతదేహాన్ని ఎలుకలు కొరికేసాయి.
By Srikanth Gundamalla Published on 1 Aug 2023 10:59 AM ISTభువనగిరిలో దారుణం..మార్చురీలో మృతదేహాన్ని కొరికిన ఎలుకలు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొన్ని చోట్ల వసతులు అస్సలు బాగుండవు. వైద్యుల కొరత, మందుల కొరత, సదుపాయల కొరత ఇలా ఏదోక సమస్య ఉండే ఉంటుంది. ఇక మార్చురీల్లో అయితే వేరే చెప్పనక్కర్లేదు. పలుసందర్భాల్లో మృతదేహాలను ఎలుకలు కొరికేసిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే యాదాద్రి భువనగిరి ఆస్పత్రిలో చోటు చేసుకుంది. అయినా.. ఆస్పత్రి సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎలుకలు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుండటంతో.. జనాలు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.
గుంటూరు జిల్లాకు చెందిన రవి శంకర్ (35)అనే వ్యక్తి ఉపాధి నిమిత్తం భువనగిరి వచ్చి లారీ డ్రైవర్ గా పనిచేశాడు. భువనగిరిలోని ప్రగతి నగర్ లో తన పిల్లలు మరియు తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉండేవాడు. మద్యానికి బానిసైన రవి ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆసు పత్రి మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అవ్వడానికి ముందు మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. ఈ క్రమంలోనే రవి డెడ్‌బాడీని ఎలుకలు కొరికి తినేశాయి. ముఖంపై ఎలుకలు కొరికిన ఆనవాళ్లు ఉండటంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మృతదేహాన్ని ఫ్రీజర్‌లో భద్రపర్చాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా గదిలోనే ఉంచారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్ చిన్ననాయక్‌ను నిలదీసి అడగగా.. మృతదేహాన్ని ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయంలోనే ముఖంపై గాట్లున్నాయని, సిబ్బంది మృతదేహాన్ని ఫ్రీజర్‌లోనే భద్రపరిచారని తెలిపారు. కాగా.. భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్ సుధీర్‌కృష్ణ మాత్రం రవిశంకర్ మృతదేహాన్ని మార్చురీకి తరలించిన సమయంలో ఎలాంటి గాయాలు కానీ గాట్లు కానీ లేవని చెప్పారు.
ఇలా మాట మార్చిచెప్పిన ఆస్పత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సిబ్బందితో ఘర్షణకు దిగారు. దాంతో.. హాస్పిటల్ సిబ్బంది, మృతుడి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వివాదం చెలరేగింది. చివరకు పోలీసులు వచ్చి నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.