ఓఆర్ఆర్‌పై ట్యాంకర్ బీభత్సం.. యువతి, యువకుడు దుర్మరణం
రంగారెడ్డి జిల్లాలో ఔటర్ రింగ్‌రోడ్డుపై ఓ వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది.
By Srikanth Gundamalla Published on 2 Jun 2024 2:45 AM GMTఓఆర్ఆర్‌పై ట్యాంకర్ బీభత్సం.. యువతి, యువకుడు దుర్మరణం
రంగారెడ్డి జిల్లాలో ఔటర్ రింగ్‌రోడ్డుపై ఓ వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో వచ్చి కార్లను ఢీకొట్టింది. అంతేకాదు.. రోడ్డుపక్కన కారు నిలిపి ఫొటోలు దిగుతున్న ఇద్దరు యువతీయువకుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వారిద్దరు దుర్మరణం చెందారు. వారి మృతదేహాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ సంఘటనాస్థలంలో భయానక వాతావరణం కనిపించింది.
ఈ ప్రమాదం ఔటర్‌రింగ్‌రోడ్డుపై హిమాయత్‌సాగర్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ వద్ద చోటుచేసుకుంది. మితిమీరిన వేగంగా ఒక వాటర్ ట్యాంకర్ ఓఆర్ఆర్‌పై ప్రయాణించింది. పోలీస్ అకాడమీ వద్దకు రాగానే అదుపు తప్పిన వాటర్ ట్యాంకర్ ముందుగా రెండు కార్లను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా రోడ్డుపక్కనే కారు ఆపి ఫొటోలు దిగుతున్న ఇద్దరు యువతి, యువకులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ టైర్ల కింద పడ్డ వారు దుర్మరణం చెందారు. వారి మృతదేహాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఇక మరో రెండు కార్లలో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. వీకెండ్ కావడంతో పలువురు విద్యార్థులు ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న ఫుడ్‌కోర్టుకి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఓఆర్ఆర్పై కారు ఆపి ఫొటోలు దిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో అక్కడే మరో 10 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా.. ఇతర వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని కారుల్లో నుంచి బయటకు తీసి అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ఇక యువతి, యువకుడి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అతడిని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటనాస్థలంలో సీసీ ఫుటేజ్‌ను సేకరించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.