పెళ్లికి నో చెప్పిందని యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని యువతిపై ఓ యువకుడు దారుణంగా దాడి చేశాడు.
By Srikanth Gundamalla Published on 21 Jun 2023 1:22 PM ISTపెళ్లికి నో చెప్పిందని యువతిపై కత్తితో విచక్షణారహితంగా దాడి
రంగారెడ్డి జిల్లా నార్సింగిలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని యువతిపై ఓ యువకుడు దారుణంగా దాడి చేశాడు. విచక్షణా రహితంగా పొడిచి పరారయ్యాడు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన యువతి ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తోంది. తల్లిదండ్రులకు దూరంగా గచ్చిబౌలిలోని హాస్టల్‌లో ఉంటోంది. అయితే.. యువతికి సమీప బంధువు చిలకలూరిపేటకు చెందిన గణేశ్‌తో పరిచయం ఏర్పడింది. యువకుడు ఒక సంస్థలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలం ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే గణేశ్ సదురు యువతిని పెళ్లి చేసుకోవాలని కోరాడు. దీనికి ఆ యువతి నిరాకరించింది. కొన్నాళ్లు ఇద్దరూ దూరంగానే ఉన్నారు. మంగళవారం మరోసారి ఇదే విషయాన్ని అడిగాడు. యువతి హాస్టల్ దగ్గరకు వెళ్లి బైక్‌పై టీ గ్రిల్ హోటల్ వద్దకు తీసుకెళ్లాడు గణేశ్. పెళ్లి చేసుకుందామని బలవంతం చేశాడు. ఆమె మళ్లీ తిరస్కరించింది. దీంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే ప్లాన్‌తో వచ్చిన గణేశ్ అతని బ్యాగ్‌లో ఉన్న కత్తిని తీసి యువతిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
స్థానికులు వెంటనే డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యువతిని ఆస్పత్రికి తరలించారు. గణేశ్ దాడిలో యువతి గొంతుతో పాటు ముఖం, చేతులపై తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. నిందితుడు గణేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు నార్సింగి పోలీసులు తెలిపారు.