Rangareddy: ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
By Srikanth Gundamalla Published on 26 April 2024 7:17 PM IST
Rangareddy: ఆల్విన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం
రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నందిగామ వద్ద ఆల్విన్ ఫార్మా కంపెనీలో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హెర్బల్ కంపెనీలో వెల్డింగ్ పనులు చేస్తుండగా అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో పలువురు కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలు చెలరేగిన వెంటనే వారు ప్రమాదం నుంచి బయట పడేందుకు ప్రయత్నించారు. కిటికీల్లో నుంచి బయటకు దూకారు. తద్వారా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే.. మరికొందరు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం జరిగిన సమయంలో 50 మంది వరకు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది.
ఆల్విన్ ఫార్మా కంపెనీలో మంటలు చెలరేగిన సంఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రమాదం జరగడంతో చుట్టుపక్కల ప్రాంతమంతా పొగతో అలుముకున్నాయి. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక స్థానికులు, కార్మికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే ఫైర్ ఇంజిన్ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నిచ్చెనల సహాయంతో కార్మికులను కిందకు తీసుకొస్తున్నారు.
మంటల ధాటికి ఏసీలు ఒక్కసారిగా పేలిపోయినట్లు తెలుస్తోంది. దాంతో.. మంటల తీవ్రత మరింత పెరిగింది. ఫైర్ ఇంజిన్ సిబ్బంది కొద్ది సమయం పాటు శ్రమించిన తర్వాత ఫ్యాక్టరీలో చిక్కుకున్న కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు సమాచారం. కాగా.. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు కొందరు భవనం నుంచి బయటకు దూకారు. వారికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశామనీ.. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత అన్ని విషయాలను వెల్లడిస్తామని తెలిపారు.