'అందుకే ఆగ్రహంతో వర్షాలు కురిపిస్తున్నా'.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

Rangam swarnalatha tells bhavishyavani at ujjaini mahankali temple. హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతోంది.

By అంజి  Published on  18 July 2022 12:25 PM IST
అందుకే ఆగ్రహంతో వర్షాలు కురిపిస్తున్నా.. భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత

హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. బోనాల కార్యక్రమంలో భాగంగా ఆలయంలో రంగం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ''భక్తులను ఎలాంటి ఆపద లేకుండా చూసుకుంటా, కంటతడి పెట్టకుండా పూజలు చేయాలి. కోరుకున్నది తప్పక నెరవేరుతుంది. గర్భిణులకు, బాలింతలకు ఎటువంటి బాధలు రానివ్వను'' అని అమ్మవారి వాక్కుగా భవిష్యవాణి చెప్పారు.

''ప్రజలు నాకు మొక్కుబడిగా పూజలు చేస్తున్నారు. మీ సంతోషానికే పూజలు చేస్తున్నారు తప్ప.. నా కోసం కాదు. వాస్తవం చెప్పండి.. నాకు పూజలు చేస్తున్నారా.. పూజలు ఎలా చేయాలో ఏటా నన్నే అడుగుతున్నారు. మొక్కుబడిగా పూజలు చేస్తున్నా.. నా బిడ్డలే కదా అని భరిస్తున్నా.. మీరు నా గుడిలో పూజలు సరిగా సరిపించడం లేదు. గర్భాలయంలో శాస్త్రబద్ధంగా పూజలు చేయండి. పూజలు సక్రమంగా, భక్తిశ్రద్ధలతో జరిపించండి. నేను సంతోషంగా పూజలు అందుకోవాలని అనుకుంటున్నా.'' అని చెప్పారు.

''నా రూపాలను ఎందుకు మారుస్తున్నారు.. మీకు నచ్చినట్లు మారుస్తారా?. స్థిరంగా ఒకే రూపంలో నేను కొలువుదీరాలని అనుకుంటున్నా.. నా రూపాన్ని స్థిరంగా ఉంచండి. నేను తెచ్చుకున్నదే కదా.. మీరేంటి నాకు చేసేది. దొంగలు దోచినట్లుగా నా నుంచే మీరు కాజేస్తున్నారు.. మీ కళ్లు తెరిపించేందుకే ఆగ్రహంతో వర్షాలు కురిపిస్తున్నా. ఆగ్రహం తట్టుకోలేరనే కోపాన్ని గోరంతే చూపుతున్నా. మీరు కొండంత తెచ్చుకుంటున్నా నాకు గోరంతే పెడుతున్నారు. నా విగ్రహ ప్రతిష్ఠను సంవత్సరంలోపు నాకు స్థిరంగా చేయండి.'' అని భవిష్యవాణి వినిపించారు.

Next Story