స్కూల్లో బాలికలపై పీఈటీ వేధింపులు..యాజమాన్యానికి ఎంఈవో నోటీసులు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలో అమానుషం చోటుచేసుకుంది.

By Srikanth Gundamalla  Published on  7 Aug 2023 3:16 PM IST
Rajendra Nagar, PET, Arrest, Harass Girls, MEO Notice,

స్కూల్లో బాలికలపై పీఈటీ వేధింపులు..యాజమాన్యానికి ఎంఈవో నోటీసులు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్ పరిధిలో అమానుషం చోటుచేసుకుంది. భవిష్యత్‌ గురించి మార్గం చూపించాల్సిన టీచరే ఓ బాలిక పాలిట శాపంలా మారాడు. రోజూ స్కూల్‌లో ఎనిమిదో తరగతి విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. రోజులు గడుస్తున్న కొద్దీ అతడి వేధింపులు ఎక్కువ కావడంతో భయపడిపోయిన బాలిక ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పింది. ఆ తర్వాత తల్లిదండ్రులు స్కూల్‌ దగ్గరకు వెళ్లి గొడవ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ రెండ్రోజులు అయినా ఎలాంటి ఫలితం లేదు. పీఈటీ టీచర్ విష్ణు మళ్లీ యథావిధిగా అదే స్కూల్‌లో పనిచేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు మరోసారి స్కూల్‌కు వెళ్లి ఆందోళన చేశారు.

అత్తాపూర్‌లోని ఓ ప్రయివేట్‌ స్కూల్‌లో జరిగింది ఈ ఘటన. ఎనిమిదో తరగతి విద్యార్థిని పట్ల పీఈటీ విష్ణు అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే.. పీఈటీ దేహశుద్ది చేసేందుకు స్కూల్‌ వద్దకు వెళ్లారు. అయితే.. అక్కడ అతను కనిపించలేదు. సెల్‌ఫోన్‌కు కాల్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చింది. కాసేపటికే స్కూల్‌లోని వాష్‌రూమ్‌లో దాక్కుని ఉన్నాడని బాలిక తల్లిదండ్రులు, బంధువులు తెలుసుకున్నారు. వెంటనే అక్కడికి చేరుకునే ప్రయత్నం చేశారు. కానీ.. స్కూల్‌ యాజమాన్యం పీఈటీని వెనకేసుకు వచ్చింది. అక్కడ లేడంటూ నమ్మించే ప్రయత్నం చేసింది. ఆందోళనకారులు ఏవీ వినకుండా పీఈటీ టీచర్‌ విష్ణుని పట్టుకున్నారు. దేహశుద్ధి చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను కాస్త శాంత పరిచారు.

పీఈటీ విష్ణు ఒక్క బాలికనే కాదు.. మరో 8 మంది విద్యార్థులను కూడా వేధించినట్లు తెలిసింది. దాంతో.. అతను స్కూల్లో ఉంటే విద్యార్థులకే ప్రమాదమని మరోసారి ఆందోళన పెంచారు స్థానికులు. విష్ణుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో.. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా.. ఏవీ పట్టించుకోని స్కూల్‌ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పైగా విష్ణుని స్కూల్‌ యాజమాన్యమే బాత్రూమ్‌లో దాచిపెట్టిందని చెప్పుకొచ్చారు. పోలీసులకు అప్పజెప్పకుండా ఎలా దాచిపెడతారంటూ యాజమాన్యాన్ని నిలదీశారు. స్థానికులు కూడా పెద్దఎత్తున గుమిగూడటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆ తర్వాత కాసేపటికే అత్తాపూర్‌లోని ఆ స్కూల్‌ వద్దకు విద్యాశాఖ అధికారులు, ఎంఈవో చేరుకున్నారు. జరిగిన ఘటనపై విచారణ జరుపుతామని తెలిపారు. సదురు ప్రయివేట్‌ స్కూల్‌కు ఎంఈవో నోటీసు కూడా జారీ చేశారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు విద్యాశాఖ అధికారులు. దాంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా.. ప్రస్తుతం పీఈటీ విష్ణు అత్తాపూర్ పోలీసుల అదుపులో ఉన్నాడు.

Next Story