మోకాళ్లలోతు నీటిలో కలెక్టరేట్ భవనం
Rajananna Siricilla collectorate filled with flood water.అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు
By తోట వంశీ కుమార్
అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు కురవడంతో అనేక గ్రామాలు జలదిగ్భదంలో చిక్కుకున్నాయి. చెరువులు మత్తడి పోస్తున్నాయి. వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరిలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉన్నాయి. శ్రీరామ్‌సాగర్ నుంచి మేడిగడ్డ వరకు నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుల దిగువన ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఊళ్లలో చాటింపు వేశారు. వానల వల్ల సింగరేణి ఓపెన్ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచింది.
నీట మునిగిన కలెక్టరేట్ భవనం..
ఇటీవల సీఎం కేసీఆర్ అట్టహాసంగా ప్రారంభించిన రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్ భవనం వరదల కారణంగా నీటమునిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ భవనం చుట్టూ వరద నీరు చేరింది. . కలెక్టరేట్ ప్రాంగణంలో మోకాళ్లలోతు నీళ్లు చేరాయి. ఇటీవలే కార్యాలయంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్ లోకి వెళ్లే మార్గం పూర్తిగా జలమయమైంది. దీంతో లోపలికి వెళ్లలేక, బయటికి రాలేక ఉద్యోగులు, జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్లాబ్‌ల జాయింట్ల వద్ద వర్షపు నీరు లీకై గదుల్లోకి నీళ్లు చేరాయి. భారీగా చేరిన వర్షపు నీటితో కలెక్టర్ కార్యాలయం ముందున్న గార్డెన్‌లో మొక్కలు పాడయ్యాయి. వాహనాల పార్కింగ్‌కు ఉపయోగించే సెల్లూరులో కూడా వరద నీరు చేరింది. జులై 4న సిరిసిల్లలో సకల సౌకర్యాలతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.