దోషులను శిక్షించే వరకు ఉద్య‌మిస్తాం - రాజాసింగ్

Raja Singh Fire On CM KCR. నేరస్తులను వదిలి న్యాయం కోసం పోరాడుతున్న వాళ్లపై కేసులా? అని

By Medi Samrat  Published on  7 Jun 2022 2:13 PM GMT
దోషులను శిక్షించే వరకు ఉద్య‌మిస్తాం - రాజాసింగ్

నేరస్తులను వదిలి న్యాయం కోసం పోరాడుతున్న వాళ్లపై కేసులా? అని బీజేపీ శాసనసభాపక్ష నేత రాజాసింగ్ ప్ర‌శ్నించారు. జూబ్లిహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ దోషులను ఎందుకు అరెస్ట్ చేయరు? అని ప్రశ్నించిన ఆయ‌న‌.. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని.. టీఆర్ఎస్, మజ్లిస్ నేతల అరాచకలను పాతరేసేదాకా ఉద్యమిస్తూనే ఉంటామ‌ని అన్నారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో తప్పు చేసిన నేరస్తులను వదిలేసి న్యాయం కోసం పోరాడుతున్న బీజేపీ నాయకుల, కార్యకర్తలతోపాటు ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసులు నమోదు చేయడం గర్హనీయం అన్నారు.

అత్యాచార ఘటనలో ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నా దోషులను ఇంత వరకు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అని ప్ర‌శ్నిచారు. ఈ కేసులో టీఆర్ఎస్, మజ్లిస్ నేతల ప్రమేయం ఉందని తెలిసినా ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారు? అని అడిగారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కి వేసేలా కేసులు పెట్టడం టీఆర్ఎస్ అరాచకాలకు పరాకాష్ట అని మండిప‌డ్డారు. కేసీఆర్ పాలనలో అత్యాచారాలు, హత్యలు, అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోందని విమ‌ర్శించారు. తాము ఏ తప్పు చేసినా చెల్లుపోతుందని భావనతో అధికార పార్టీ నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని అన్నారు.

నమ్మిన సిద్దాంతాల కోసం.. పేదల పక్షాల పోరాడే తత్వం బీజేపీ సైనికులకే సొంతం అని రాజా సింగ్ అన్నారు. టీఆర్ఎస్, మజ్లిస్ అరాచకాలపై పోరాడుతున్న తనపైనా కేసీఆర్ సర్కార్ అనేక కేసులు పెడుతోంది. అయినా భయపడే ప్రసక్తే లేదు. అధికార పార్టీ బెదిరింపులు, పోలీసుల లాఠీఛార్జీలు, కేసులకు భయపడి వెనుకంజ వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. దోషులను శిక్షించే వరకు బిజెపి ఉద్యమిస్తూనే ఉంటుందని అన్నారు.


Next Story
Share it