దుబ్బాకలో గెలిచి తిరుమలలో మెరిసిన రఘునందన్ రావు
Raghunandhan Rao Visit Tirumala. దుబ్బాక ఉపఎన్నిక ఫలితం వెలువడింది. తుదివరకూ గట్టిపోటి ఇచ్చి బీజేపీ అభ్యర్ధి
By Medi Samrat Published on 11 Nov 2020 12:29 PM IST
దుబ్బాక ఉపఎన్నిక ఫలితం వెలువడింది. తుదివరకూ గట్టిపోటి ఇచ్చి బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన రఘునందన్ ఈ రోజు ఉదయం తిరుమల తిరుపతిలో మెరిశారు. తిరుపతి వెంకన్న దర్శన నిమిత్తం ఆయన తిరుమల వెళ్లారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను రఘునందన్ రావు.. దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో గెలిచి వెంకన్న దర్శనానికి వచ్చానని అన్నారు. రాజకీయాలు మాట్లాడకూడదు.. కానీ నా ఈ గెలుపు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షణాదిన బీజేపీ మరింత బలోపేతం కావడానికి దోహదపడుతుందన్నారు. ప్రజలతో మమేకమైన నాయకులను ఎప్పటికైనా ఆదరిస్తారని దుబ్బాక ప్రజలు మంచి మెసేజ్ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా దుబ్బాక ప్రజలకు రఘునందన్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
దుబ్బాక గెలుపు స్పూర్తిగా నరేంద్రమోదీ నాయకత్వంలో రెండు తెలుగు రాష్ట్రాలలతో బీజేపీ గెలుపుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని రఘునందన్ రావు అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఏకపక్ష నిర్ణయాలతో తమకు నచ్చిన విధంగా ఒంటెద్దుపోకడలతో పాలన సాగిస్తున్న నేఫథ్యంలో.. కొత్తతరం, యువతరం నాయకులు సాధ్యమైనంతవరకు ప్రజాసమస్యలపై పోరాటం చేస్తే దుబ్బాక ఫలితమే ఉభయ తెలుగు రాష్ట్రాలలో పునరావృతమవుతాయని అన్నారు.
అనంతరం తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించిన అనంతరం వెంకన్న దర్శనం చేసుకున్నారు.