తెలంగాణలో గత కొంత కాలంగా అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా మారుతుంది బీజేపీ. ఐదేళ్ల క్రితం బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగా ఉన్నా.. ఇటీవల జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ తన సత్తా చాటుతుంది. ముఖ్యంగా దుబ్బాకలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేగా రఘు నందన్ గెలవడం.. ఆ తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు రావడం వెరసి బీజేపీ ఇప్పుడు అధికార పార్టీకి పోటీగా నిలిచింది. శాసన సభలో అన్ని వర్గాల గొంతుకను వినిపిస్తానని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు వెల్లడించారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టేముందు అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ప్రజల పక్షాన పాలకుల తప్పిదాలను ఎండగడతానని అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేసినట్లు రఘునందన్ రావు తెలిపారు.
తనపై నమ్మకం ఉంచి గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు న్యాయం జరిగేలా పోరాడతానని ప్రతిన పూనారు. అసెంబ్లీ వేదికగా మల్లన్న సాగర్ నిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. పీఆర్సీ, ఉద్యోగ సమస్యలపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్నీ నిలదీస్తానని తెలిపారు. స్వరాష్ట్రం సిద్ధించిన ఆశయాలు నెరవేరేలా తనవంతు ప్రయత్నం చేస్తానని రఘునందన్‌రావు హామీ ఇచ్చారు.
రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ్యును ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అసెంబ్లీ సమావేశ మందిరంలో ప్రసంగిస్తున్నారు. ఈ నెల 18న 2021-22 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.