యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట సాంఘిక సంక్షేమ గురుకులంలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఆరుగురు పదవ తరగతి విద్యార్థులపై ఇంటర్ స్టూడెంట్స్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్ధరాత్రి పదో తరగతి విద్యార్థి కౌశిక్‌పై 20 మంది ఇంటర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. అడ్డొచ్చిన మరో ఐదుగురిపై కర్రలతో దాడి చేశారని జూనియర్ విద్యార్థులు తెలిపారు.
క్రికెట్ బ్యాట్లతో దాడి చేయడంతో విద్యార్థులకు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. సీనియర్ల దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనను అక్కడే ఉన్న తోటి విద్యార్థులు వీడియో తీశారు. ర్యాగింగ్ ఘటన బయటకు రాకుండా హాస్టల్ యాజమాన్యం లోలోపల ఐదుగురు విద్యార్థులను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గురుకుల ప్రిన్సిపాల్, హాస్టల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.