జడ్పీ చైర్మన్ పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు.. సీఎం దగ్గరికి వెళ్లలేదు
Putta madhu fires on media over lawyer couple case.పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు చేశారు.
By తోట వంశీ కుమార్ Published on 20 Feb 2021 4:16 PM ISTపెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు సంచలన వ్యాఖ్యలు చేశారు. వామన్‌రావు దంపతుల హత్య కేసులో పోలీసుల కన్నా మీడియానే అత్యుత్సాహాం ప్రదర్శిస్తోందన్నారు. ఫోర్త్ ఎస్టేట్ గా బావించే మీడియా ఒకసారి ఆలోచించాలని, కొంతమంది ఎప్పుడు పుట్ట మధును అరెస్టు చేస్తారని చూస్తున్నారన్నారు. పేద బిడ్డ జడ్పీ చైర్మన్ అయితే సహించలేక పోతున్నారని ఆయన తెలిపారు. మీడియా అసత్య ప్రచారానికి కాంగ్రెస్ నేతలు తోడయ్యారని విమర్శించారు. పోలీసు విచారణ తర్వాత వాస్తవాలతో హైదరాబాద్‌లో మీడియా ముందుకు వస్తానని ఆయన పేర్కొన్నారు. మంథనిలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు.
పోలీసులు చేయాల్సిన దర్యాప్తును కొన్ని మీడియా సంస్థలే చేస్తున్నట్లుగా ఉందన్నారు. ఇక ఎమ్మెల్యే శ్రీధర్ బాబు నేను రౌడీయిజం చేసినట్లు చెబుతున్నాడని, అసలు దొంగ రౌడీయిజం చేసింది శ్రీధర్ బాబు ఆయన తమ్ముడేనని ఆయన అన్నారు. మాతో ఎవరికీ ఇబ్బంది లేదు, శ్రీధర్ బాబుతోనే అందరికీ ఇబ్బంది ఉందని ఆయన అన్నారు. వామన్‌రావు దంపతుల హత్య తరువాత తాను మంథనిలో ఉండడం లేదని.. ముఖం చాటేశానని కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తాను ఎక్కడికీ పారిపోలేదని మంథనిలోనే ఉన్నానని స్పష్టం చేశారు. తాను సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దగ్గరికి వెళ్లలేదని, వారిని అపాయింట్‌మెంట్ అడగలేదని తెలిపారు. ఎందుకు నా కుటుంబం పై, నాపై కక్ష కట్టారో అర్థం కావడం లేదన్నారు. ప్రజల కోసమే జీవితాలను అంకితం చేశామన్నారు.
ఇదిలా ఉంటే.. వామన్ రావు హత్యకు మధు మేనల్లుడు వాహనాలు, ఆయుధాలు సమకూర్చాడు అనే ఆరోపణలతో ఆయన్ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయానికి సంబంధించి పుట్ట మధు స్పందించలేదు.