మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో శిశువుల మార్పిడి కలకలం
Protests at Mancherial hospital after charges of baby exchange.మంచిర్యాల జిల్లా ప్రభుత్వ జనరల్(జిజిహెచ్) ఆస్పత్రిలో
By తోట వంశీ కుమార్
మంచిర్యాల జిల్లా ప్రభుత్వ జనరల్(జిజిహెచ్) ఆస్పత్రిలో శిశువుల మార్పిడి కలకలం రేపుతోంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా శిశువుల మార్పిడి జరిగిందని ఆరోపిస్తూ ఆస్పత్రి ప్రాంగణంలో బుధవారం నిరసనకు దిగారు.
చెన్నూరు మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన మమత, ఆసిఫాబాద్‌కు చెందిన బొల్లం పావనిలు పది నిమిషాల వ్యవధిలో మంచిర్యాల జిల్లా జనరల్ ఆస్పత్రిలో శిశువులకు జన్మనిచ్చారు. డెలివరీ అయిన తరువాత మగబిడ్డ జన్మించినట్లు నర్సులు చెప్పారని అయితే.. ఆ తరువాత ఆ ఆడబిడ్డను ఇచ్చారని మమత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకు కూడా మగబిడ్డనే పుట్టినట్లు ఆస్పత్రి సిబ్బంది చెప్పారని పావనీ కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
దీంతో ఇరుకుటుంబాలు, ఆస్పత్రి సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని ఆరోపిస్తూ మమత కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. అటు పావని కుటుంబ సభ్యులు కూడా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అందరికి సర్దిచెప్పి ఆందోళనను విరమింపజేశారు.
ఈ ఘటనపై జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరిశ్చంద్రారెడ్డి మాట్లాడుతూ శిశువులను శిశు, మహిళా శాఖ అధికారులకు అప్పగించినట్లు చెప్పారు. నవజాత శిశువులకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగిస్తామన్నారు. ఇందుకు ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించారని అన్నారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.