కరోనా ఉధృతి కారణంగా పాఠశాలలు నడవని పరిస్థితి నెలకొంది. దీంతో పరీక్షలు లేకుండానే ప్రభుత్వం విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేసింది. ఈ మేరకు సోమవారం ఒకటో తరగతి నుండి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.
అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు అన్ఎయిడెడ్ స్కూళ్లకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి. కొవిడ్ సంక్షోభం కారణంగా ఏప్రిల్ 27 నుండి మే 31వ తేదీ వరకు అన్ని స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలావుంటే.. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. గడిచిన కొన్ని రోజులుగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో73,275 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 6,551 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 4,01,783కి చేరింది. నిన్న ఒక్క రోజే కరోనా కారణంగా 43 మంది మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి రాష్ట్రంలో ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 2,042కి పెరిగింది.