ప్రయాణికులకు షాక్.. లగేజీతో బస్సు డ్రైవర్ పరార్
Private Bus Driver escaped along with bus.తమ స్వంత ఊరికి వెళ్లేందుకు వారంతా కలిసి ఓ ప్రైవేటు బస్సును మాట్లాడుకున్నారు
By తోట వంశీ కుమార్ Published on 6 Nov 2021 9:46 AM ISTతమ స్వంత ఊరికి వెళ్లేందుకు వారంతా కలిసి ఓ ప్రైవేటు బస్సును మాట్లాడుకున్నారు. అయితే.. మార్గం మధ్యలో బస్సు రిపేర్ వచ్చిందని.. వారందరిని నమ్మించి ఓ హోటల్ వద్ద దించారు. బస్సును రిపేర్ చేయించుకుని వస్తామని చెప్పి డ్రైవర్, క్లీనర్.. బస్సుతో పాటు పరారయ్యారు. ప్రయాణీకుల సామాగ్రి అంతా బస్సులోనే ఉండిపోయింది. ఆరుగంటలు గడిచినా కూడా బస్సు రాకపోగా.. డ్రైవర్, క్లీనర్ తమ సెల్‌పోన్లను స్విచ్చాప్ చేసుకున్నారు. అప్పటికి గాని విషయం అర్థం కాలేదు వారికి. ఊరు గాని ఊరులో చేతిలో చిల్లి గవ్వలేక.. చివరికి పోలీసులను ఆశ్రయించారు. ప్రయాణీకుల దీనావస్థను అర్థం చేసుకున్న పోలీసులు వారికి భోజనంతో పాటు వసతి కల్పించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద జరిగింది.
వివరాల్లోకి వెళితే.. అసోంకు చెందిన 59 మంది, బిహార్‌కు చెందిన ఐదుగురు మొత్తం 64 మంది కేరళ నుంచి అసోంకు వెళ్లేందుకు ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సును మాట్లాడుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నాం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి వద్దకు వచ్చే సరికి బస్సు రిపేర్‌కు వచ్చిందని డ్రైవర్, క్లీనర్ ప్రయాణీకులకు చెప్పారు. సమీపంలోని ఓ హోటల్ వద్ద బస్సును ఆపారు. ప్రయాణీకులను దించివేసి బాగుచేయించుకు వస్తామని చెప్పి బస్సుతో పాటు వెళ్లిపోయారు.
బస్సు కోసం దాదాపు ఆరు గంటల పాటు వేచి చూసినప్పటికి బస్సు రాలేదు. డ్రైవర్, క్లీనర్ల సెల్‌ఫోన్లకు కాల్ చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. అప్పటికి గాని అసలు విషయం అర్థం కాలేదు వారందరికి లగేజ్‌తో ఊడాయించారని. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. దీంతో శుక్రవారం రాత్రి పోలీసులను ఆశ్రయించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారి పరిస్థితిని అర్థం చేసుకున్నారు. వారికి భోజన సదుపాయాన్ని సమకూర్చారు. చిట్యాల సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో వారికి ఆశ్రయం కల్పించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రయాణీకులు ఇచ్చిన సెల్‌పోన్ సెంబర్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.