జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌లోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ (బాలుర) ప్రిన్సిపాల్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. 13 ఏళ్ల బాలుడు మృతి చెందడంతో.. నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే ఆరోపణలపై సస్పెన్షన్ వేటు పడింది.
13 ఏళ్ల రాజారపు గణాదిత్య, 8వ తరగతి విద్యార్థి జూలై 26, శుక్రవారం తెల్లవారుజామున మూర్ఛతో బాధపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. స్కూల్ యాజమాన్యం అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించకుండా.. హాస్టల్‌కు వచ్చి తమనే తీసుకెళ్లాలని సంప్రదించారని బాధితుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన కలెక్టర్ బి సత్య ప్రసాద్.. పాఠశాలను సందర్శించి, ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ధృవీకరించారు. దీంతో ప్రిన్సిపాల్ కె విద్యాసాగర్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్) సెక్షన్ 194 కింద కేసు నమోదు చేశారు.