కరీంనగర్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
By Srikanth Gundamalla Published on 8 May 2024 11:26 AM IST
కరీంనగర్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే ప్రచారానికి తెరపడనున్న క్రమంలో ఆయన కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ టూర్‌లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ మీటింగ్‌లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు.
దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవమే ఎదురైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మిగిలిన నాలుగు విడతల్లో కూడా బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధం అయ్యారని చెప్పారు. అయితే.. కరీంనగర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బండి సంజయ్ బరిలో ఉన్నారనీ.. ఆయన గెలుపు ఎప్పుడో ఖాయం అయ్యిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి ప్రజల ఆదరణ మరింత పెరిగిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థిగా కనీసం ఓటర్లకు తెలియని వ్యక్తిని బరిలో నిలిపిందని విమర్శించారు ప్రధాని మోదీ.
కాంగ్రెస్ సుదీర్ఘకాలం పాటు కేంద్రంలో అధికారంలో కొనసాగిందని ప్రధాని మోదీ చెప్పారు. అయితే.. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయని చెప్పారు. కానీ.. పదేళ్లలోనే ఎన్డీఏ పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తోందని చెప్పారు. వ్యవసాయాన్ని ఆధునీకరించి లాభసాటిగా మార్చామని ప్రధాని అన్నారు. ఆ రంగంలో డ్రోన్లను ప్రోత్సహించామన్నారు. టైక్స్‌టైల్ పార్క్‌లు ఏర్పాటు చేశామనీ.. రైతులకు అండగా నిలబడేందుకు వారికి పెట్టుబడి సాయం కూడా అందిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందనీ.. ఎక్కడా కూడా ఆ పార్టీ ప్రభావం కొంచెం కూడా కనిపించడం లేదని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్ ఓటమి కరీంనగర్‌లో ఖరారు అయ్యిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు తమ మొదటి ప్రాధాన్యత కుటుంబాలకే ఇస్తారని విమర్శించారు. అందుకే వారి కుటుంబ సభ్యులే బాగుపడ్డారని అన్నారు. కానీ.. బీజేపీ మాత్రం అలా కాదు అనీ.. దేశం కోసం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటే అన్నారు. నాణేనికి బొమ్మా బొరుసు లాంటివంటూ ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఇక సభలో పాల్గొనడానికి ముందు ప్రధాని మోదీ రాజన్న సిరిసిల్లలోని శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.