భారతదేశ 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఢిల్లీ నుంచి ఈ నెల 28న ఉదయం ప్రత్యేక విమానంలో హకీంపేటలోని విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు చేరుకుంటారు. మూడు రోజుల పాటు ఆమె ఇక్కడే ఉండనున్నారు.
ఈ పర్యటనలో రాష్ట్రపతి ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని దర్శించుకోనున్నారు. డిసెంబర్ 29న యాదగిరిగట్టుకు వెళ్లి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. అదే రోజు సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో ప్రముఖులు, ఉన్నతాధికారులతో తేనీటి విందులో పాల్గొంటారు.
రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ద్రౌపది ముర్ము తొలిసారి తెలంగాణకు వస్తుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి నిలయంలో మరమ్మతు పనులు చేపట్టారు. ఆమె పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు రాష్ట్రపతి నిలయంలో తెలంగాణ పోలీసులు, ఆర్మీ, కంటోన్మెంట్ అధికారులు, భద్రతతో సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు.
ఇదిలాఉంటే.. ఈ యాదాద్రి ఆలయాన్ని ఇప్పటి వరకు నలుగురు రాష్ట్రపతులు సందర్శించారు. ఐదో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలవనున్నారు.