సుఖాయ్‌ జెట్‌లో ప్రయాణం గొప్ప అనుభూతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

గత ఏప్రిల్‌లో సుఖాయ్‌ జెట్‌లో ప్రయాణించారు రాష్ట్రపతి. ఈ సందర్బంగా ఆ అనుభూతిని గుర్తు చేసుకున్నారు. దాదాపు 30 నిమిషాలు..

By Srikanth Gundamalla  Published on  17 Jun 2023 6:58 AM GMT
President Droupadi Murmu, Air Force Parade, Hyderabad

సుఖాయ్‌ జెట్‌లో ప్రయాణం గొప్ప అనుభూతి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

హైదరాబాద్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె నగర శివార్లలోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌కు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అయితే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరేడ్‌కు రివ్యూయింగ్‌ అధికారిగా తొలిసారిగా వచ్చారు. కాడెట్ల పరేడ్, విన్యాసాలు, ఆహుతలను ఆమె తిలకించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌తో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

గ్రాడ్యుయేట్స్‌ను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఆమె చెప్పారు. ధైర్యవంతులు అయిన క్యాడెట్స్‌ను కన్న వారి తల్లిదండ్రులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి సేవలను గుర్తు చేసుకోవాలని చెప్పారు. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో ఉండే వారు అన్నింటిని కాదనుకుని వచ్చి.. దేశానికి సేవలందిస్తున్నారని ద్రౌపది ముర్ము అన్నారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ మన దేశ ప్రజలకే కాదు.. ఇటీవల టర్కీలో జరిగిన భూకంపంలోనూ బాగా పనిచేసిందని కొనియాడారు. కోవిడ్‌ వేవ్స్‌ సమయంలోనూ అద్భుతంగా పని చేశారని చెప్పారు. అంతేకాకుండా వర్షాలు, వరదలు ఎక్కువగా వచ్చినప్పుడు ప్రజల ప్రాణాలు కాపాడటంలో ఎయిర్‌ఫోర్స్‌ ఎంతో సహాయ పడుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.

విధుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదురకొనేందుకు నూతన సాంకేతికను అందుపుచ్చుకోవాలని రాష్ట్రపతి సూచించారు. గత ఏప్రిల్‌లో సుఖాయ్‌ జెట్‌లో ప్రయాణించారు రాష్ట్రపతి. ఈ సందర్బంగా ఆ అనుభూతిని గుర్తు చేసుకున్నారు. దాదాపు 30 నిమిషాల పాటు జెట్‌లో విహరించానని చెప్పారు. బ్రహ్మపుత్రి, తేజ్‌పూర్‌ లోయలు, హిమాలయాలను అంత ఎత్తులో నుంచి చూసినప్పుడు అద్భుతంగా అనిపించిందని రాష్ట్రపతి చెప్పారు. ఫైటర్‌ జెట్‌ పైలట్లలో మహిలలు అధికంగా ఉన్నారని.. ఇది ఎంతో సంతోషించదగ్గ విషయమని అన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

Next Story