యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్న రాష్ట్ర‌ప‌తి ముర్ము

President Draupadi Murmu visits Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple.రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము యాద‌గిరి గుట్ట

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Dec 2022 11:57 AM IST
యాదాద్రి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామిని ద‌ర్శించుకున్న రాష్ట్ర‌ప‌తి ముర్ము

రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము శుక్ర‌వారం యాద‌గిరిగుట్ట‌లో ప‌ర్య‌టించారు. యాదాద్రి శ్రీ ల‌క్ష్మి న‌ర‌సింహ‌స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఆల‌య అర్చ‌కులు వేదాశీర్వ‌చ‌నం అందించారు. స్వామివారి చిత్ర‌ప‌టంతో పాటు తీర్థ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు. అనంత‌రం రాష్ట్ర‌ప‌తి యాదాద్రి ప్రధాన ఆలయ పరిసరాలను పరిశీలించారు. అద్దాల మండపం, ఫొటో ఎగ్జిబిషన్‌ను సంద‌ర్శించారు.

అంత‌క‌ముందు ఈ ఉద‌యం హైద‌రాబాద్ నుంచి గ‌వ‌ర్న‌ర్ త‌మిళి సైతో క‌లిసి ప్ర‌త్యేక హెలికాఫ్ట‌ర్‌లో రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము యాద‌గిరిగుట్ట‌కు చేరుకున్నారు. మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, జగదీశ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ప్ర‌భుత్వ విప్ గొంగిడి సునీత‌ పుష్పగుచ్చాలతో రాష్ట్ర‌ప‌తికి స్వాగ‌తం ప‌లికారు. ఆలయం వద్ద మంగ‌ళ‌వాద్యాలు, పూర్ణకుంభంతో అర్చకులు, అధికారులు ఆహ్వానించారు. ఉత్త‌ర ద్వారం ద్వారా ఆల‌యంలోకి ప్ర‌వేశించారు.


రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో అధికార యంత్రాగం భారీ ఏర్పాట్లు చేసింది. ప్ర‌ధాన ఆల‌యాన్ని మామిడి, అర‌టి తోర‌ణాలు, పూల‌తో అలంక‌రించారు. రాష్ట్ర‌ప‌తి ఆల‌యానికి వ‌చ్చి, వెళ్లే వ‌ర‌కు ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా అధికారులు ప‌కడ్భందీ చ‌ర్య‌లు చేప‌ట్టారు.

కాగా.. యాదగిరిగుట్టను సందర్శించిన ఐదో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావడం గమనార్హం.

Next Story