వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ నిండు ప్రాణాలను బలిగొంది. ఏడాది పాపను అనాథను చేసింది. ఇంకా ఈ భూమి మీద అడుగుపెట్టకుండానే ఆమె కడుపులోని శిశివు ప్రాణాలు పోయేలా చేసింది. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది.
వివరాల్లోకి వెళితే.. యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి గ్రామానికి చెందిన ఓ మహిళ కాన్పు కోసం సంవత్సరం క్రితం భువనగిరిలోని కే.కే ఆస్పత్రిలో చేరింది. డాక్టర్లు ఆమెకు ఆపరేషన్ చేసి డెలివరీ చేశారు. ప్రసవం అనంతరం ఆ మహిళ కడుపు నొప్పితో బాధపడుతోంది. ఇటీవల తీవ్రం కావడంతో బంధువులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో మహిళ కడుపులో దూదిని గుర్తించారు. తొలికాన్పు సమయంలోనే వైద్యులు దూది మరిచిపోయినట్లు తేలింది.
దూది అలాగే ఉండడంతో పేగులు దెబ్బతిన్నాయని వైద్యులు చెప్పారు. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. ప్రస్తుతం ఆ మహిళ ఆరు నెలల గర్భిణీ. ఆ మహిళ మృతదేహాన్నితీసుకొని తొలికాన్పు చేసిన భువనగిరి కేకే ఆస్పత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. మహిళ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది.