'డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో వాహనాలు సీజ్ చేయొద్దు'.. పోలీసులకు తెలంగాణ హైకోర్టు గైడ్‌లైన్స్
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల సమయంలో వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
By - అంజి |
'డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో వాహనాలు సీజ్ చేయొద్దు'.. పోలీసులకు తెలంగాణ హైకోర్టు గైడ్‌లైన్స్
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల సమయంలో వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన సందర్భాల్లో, పోలీసులు చట్టప్రకారం వ్యవహరించాలే తప్ప వాహనాలను స్వాధీనం చేసుకోకూడదని జస్టిస్ ఈవీ వేణుగోపాల్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తే, మూడు రోజుల్లోగా సంబంధిత మెజిస్ట్రేట్ కోర్టులో అభియోగ పత్రం (ఛార్జ్ షీట్) దాఖలు చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే పోలీసు అధికారులు కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.
కోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, వాహనం నడుపుతున్న వ్యక్తి మద్యం తాగి ఉన్నట్లు తేలితే అతడిని డ్రైవింగ్ చేయనివ్వకూడదు. అయితే, అతడితో పాటు ఉన్న మరో వ్యక్తి మద్యం తాగకుండా ఉండి, సరైన లైసెన్స్ కలిగి ఉంటే వాహనాన్ని వారికి అప్పగించాలి. ఒకవేళ ఎవరూ లేని పక్షంలో, సదరు వ్యక్తి బంధువులకు లేదా స్నేహితులకు సమాచారం అందించి వాహనాన్ని తీసుకెళ్లమని చెప్పాలి. ఎవరూ రాని పక్షంలో మాత్రమే వాహనాన్ని తాత్కాలికంగా సమీప పోలీస్ స్టేషన్‌లో భద్రపరచాలి, కానీ దానిని సీజ్ చేసినట్లు పరిగణించకూడదు.
వాహన యజమాని లేదా గుర్తింపు పొందిన వ్యక్తి ఆర్‌సీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను చూపిస్తే వాహనాన్ని వెంటనే వదిలిపెట్టాలని కోర్టు ఆదేశించింది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 448-ఏ ను పోలీసులు ఖచ్చితంగా అమలు చేయాలని సూచించింది. కేవలం వాహనంపై పెండింగ్ చలాన్లు ఉన్నాయనో లేదా పాత కేసులు ఉన్నాయనో వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని, తగిన పత్రాలు సమర్పిస్తే వాహనాన్ని అప్పగించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది.