ప్రధాని వరంగల్ టూర్‌ను బహిష్కరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటన
ప్రధాని వరంగల్ టూర్‌ని బహిష్కరిస్తున్నట్లు తాజాగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
By Srikanth Gundamalla Published on 7 July 2023 12:56 PM ISTప్రధాని వరంగల్ టూర్‌ను బహిష్కరిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటన
ప్రధాని మోదీ జూలై 8న తెలంగాణ పర్యటనకు రానున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆయన పర్యటనకు వెళ్తారా లేదా అన్నదానిపై పెద్ద చర్చ జరిగింది. చాలా కాలం నుంచి సీఎం కేసీఆర్ ప్రధానికి ఆహ్వానం పలకడం లేదు. ఆయన పాల్గొనే కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. ఈసారి అయినా కేసీఆర్ ప్రధాని వరంగల్ టూర్‌కు వెళ్తారని అనుకున్నారు. కానీ.. ప్రధాని వరంగల్ టూర్‌ని బహిష్కరిస్తున్నట్లు తాజాగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. దాంతో.. కేసీఆర్ ఈసారి కూడా ప్రధాని టూర్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. 'ప్రధాని వరంగల్ పర్యటనను బహిష్కరిస్తున్నాం. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదు. మళ్లీ ఏ మొహం పెట్టుకుని ప్రధాని మోదీ తెలంగాణకు వెళ్తున్నారు? తెలంగాణ పుట్టుకనే ప్రధాని మోదీ అవమానించారు. ఈ విషయం తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు. అంతేకాదు కేంద్రానికి మనం ఇస్తున్న నిధులు ఎక్కువ.. వారి నుంచి మనకు వస్తున్నది తక్కువ. ఏ అంశంలోనూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మంచి చేయలేదు. సమయం దొరికినప్పుడల్లా తెలంగాణపై మోదీ విషం కక్కుతూనే ఉన్నారు.'అని మంత్రి కేటీఆర్ అన్నారు.
ప్రధాని మోదీ రేపు వరంగల్ పర్యటనకు రానున్నారు. వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 9:45 గంటలకు హైదరాబాద్‌లోని హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11:30 గంటల నుంచి మధ్యామ్నం 12:10 గంటల వరకు వరంగల్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభలో ప్రసంగిస్తారు. ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1:10 గంటలకు హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌కు బయల్దేరి వెళ్తారు.