త్వరలో తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ మొదటి వారంలో భాగ్యనగరానికి రానున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా ఎయిమ్స్ (AIIMS) బిబీనగర్ విస్తరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.

By -  అంజి
Published on : 22 March 2026 8:40 AM IST

PM Narendra Modi Hyderabad Visit, AIIMS Bibinagar Expansion, MMTS Phase 2, Kazipet Rail Unit, Amrit Bharat Station Scheme, Telangana Development, Parade Grounds Public Meeting

త్వరలో తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ మొదటి వారంలో భాగ్యనగరానికి రానున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా ఎయిమ్స్ (AIIMS) బిబీనగర్ విస్తరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.1,399 కోట్ల బడ్జెట్‌తో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో 750 పడకల ఆసుపత్రి, 35కు పైగా స్పెషాలిటీ మరియు సూపర్ స్పెషాలిటీ విభాగాలు ఏర్పాటు కానున్నాయి. దీనితో పాటు 100 సీట్ల మెడికల్ కాలేజీ, 60 సీట్ల నర్సింగ్ కాలేజీ మరియు 30 పడకల ఆయుష్ (AYUSH) బ్లాక్‌ను కూడా నిర్మించనున్నారు.

రైల్వే రంగానికి సంబంధించి కూడా ప్రధాని పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ ఏడాది ఉత్పత్తి ప్రారంభించనున్న కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఆయన జాతికి అంకితం చేయనున్నారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ABSS) కింద తెలంగాణలో రూ.2,750 కోట్లతో ఆధునీకరించిన సుమారు 40 రైల్వే స్టేషన్లలో భాగంగా.. హైటెక్ సిటీ, బేగంపేట, చర్లపల్లి మరియు అలంపూర్ స్టేషన్ల పునరుద్ధరణ పనులను ఆయన ప్రారంభించే అవకాశం ఉంది.

అంతేకాకుండా, మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (MMTS) ఫేజ్-2 లోని మిగిలిన సెక్షన్ల పనులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఘట్‌కేసర్ నుండి లింగంపల్లికి, అలాగే మౌలా అలీ మరియు సికింద్రాబాద్ మీదుగా శంషాబాద్‌కు కనెక్టివిటీ పెరుగుతుంది. పర్యటనలో భాగంగా పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో కూడా మోదీ ప్రసంగించనున్నారు. పర్యటనకు సంబంధించిన ఖచ్చితమైన తేదీలను అధికారులు ప్రస్తుతం ఖరారు చేస్తున్నారు.

Next Story