ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో కేసీఆర్ సర్కారును కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశంసలతో ముంచెత్తారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో భావసారూప్యత కలిగిన పార్టీలు ఒక్కటయ్యే అవకాశం వచ్చిందని.. తెలంగాణ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ప్రజలకు మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జాతికి దిశానిర్దేశం చేస్తుందన్న పినరయి కేసీఆర్ పోరాటానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు. కేసీఆర్ సర్కారు అమలు చేస్తున్న పథకాలను ప్రశంసించారు. కంటి వెలుగు స్కీం చరిత్రలో నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగాన్ని మోదీ ప్రభుత్వం భ్రష్టుపట్టించిందని.. బీజేపీపై కలిసిపోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. మోదీ పాలన ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని అన్నారు. ప్రజలను మతాలవారీగా విభజిస్తున్నారని.. రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరం పోరాడాల్సిన అవసరం ఉందని విజయన్ పిలుపునిచ్చారు.
బీజేపీకి వ్యతిరేకంగా జరిగే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం అవుతోందని.. తెలంగాణ పోరాటాల గడ్డ అని ప్రశంసించారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలు ప్రశంసనీయం అని పేర్కొన్నారు. ప్రజా ఉద్యమం చేపట్టిన కేసీఆర్ కు అభినందనలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వానికి తమ సంఘీభావం ప్రకటిస్తున్నామని.. తెలంగాణ సంక్షేమ పథకాలు కేరళలోనూ ప్రవేశపెడతామని చెప్పారు. దేశంలో రాజ్యాంగ సంక్షోభం నెలకొందని.. దేశ సమగ్రత, హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. రాష్ట్రాల అభిప్రాయాలతో సంబంధం లేకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహిస్తోందని అన్నారు. రాష్ట్రాలకు రావాల్సిన నిధులు ఇవ్వకపోగా గవర్నర్ వ్యవస్థను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని అన్నారు.