సైదాబాద్ నిందితుడు రాజు మృతిపై హైకోర్టులో పిల్
Pil filed in TS High court on Saidabad case accused Raju Suicide.సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారి హత్యాచార ఘటనలో
By తోట వంశీ కుమార్ Published on 17 Sep 2021 7:04 AM GMT
సైదాబాద్ సింగరేణి కాలనీ చిన్నారి హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న రాజు మృతిపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. రాజు మృతిపై అనుమానాలు ఉన్నాయని పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు. రాజుది కస్టోడియల్ మృతిగా అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై అత్యవసరంగా విచారించాలని హైకోర్టును అభ్యర్థించారు. మధ్యాహ్నాం దీనిపై హైకోర్టు విచారణ చేపట్టనుంది.
చిన్నారి హత్యాచారం ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందే. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మరీ పోలీసులు గాలింపు చేపట్టారు. నిందితుడి ఆచూకీ తెలిపినట్లయితే.. రూ.10లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టగా.. గురువారం వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం లభ్యమైంది. రైలుకు ఎదురెళ్లి రాజు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
కాగా.. రాజు ఆత్మహత్యపై అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎక్కడో రాజును పట్టుకుని చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజు ఆత్మహత్యపై విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.