5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపిన సర్కార్
తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది.
By Medi Samrat Published on 25 Aug 2023 6:31 PM ISTతెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులు భర్తీ చేయనున్నారు. సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్ధీకణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రభుత్వం జారీ చేయనుంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 13,500 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని.. నిరుద్యోగులు, బీఈడీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. లక్డీకపూల్‌లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి పిలుపునివ్వగా.. పోలీసులు అరెస్ట్ చేశారు.
టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా గతంలో మాదిరిగా జిల్లా ఎంపిక కమిటీలు(డీఎస్సీ) నియామకాలు చేపడతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ ప్రకారం టెట్‌లో క్వాలిఫై అయిన వారంతా టీఆర్‌టీకి పోటీ పడేందుకు అర్హులు. అక్కడ అర్హత సాధించిన వారి వివరాలతో జిల్లాలవారీ జాబితాను రూపొంచి డీఎస్సీకి పంపుతారు. అనంతరం ఆయా జిల్లాల డీఎస్సీలు నియామకాలు చేపడతాయని చెప్పారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) సెప్టెంబరు 15న నిర్వహిస్తామని మంత్రి సబిత తెలిపారు. సెప్టెంబర్ 27న ఫలితాలను వెల్లడించనున్నట్టు తెలిపారు. ఆ తర్వాత వెంటనే నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఇటీవలే కాంట్రాక్ట్ విధానంలో 1264 బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేశామని.. ప్రాజెక్టు అయినందున కాంట్రాక్ట్ విధానంలో నియమించామని చెప్పారు. కేజీబీవీల్లో సిబ్బందిని క్రమబద్ధీకరించడం కుదరదని మంత్రి తేల్చి చెప్పారు.