Interview: కిషన్‌రెడ్డి తీరుతో ప్రజలు సంతోషంగా లేరు.. సికింద్రాబాద్ సీటు BRSదే: పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి బీఆర్‌ఎస్ అభ్యర్థి టి పద్మారావు గౌడ్ పోటీ పడుతున్నారు.
By Mahesh Avadhutha Published on 29 April 2024 2:15 PM ISTInterview: కిషన్ రెడ్డి తీరుతో ప్రజలు సంతోషంగా లేరు.. సికింద్రాబాద్ సీటు BRSదే: పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి బీఆర్‌ఎస్ అభ్యర్థి టి పద్మారావు గౌడ్ పోటీ పడుతున్నారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి, బీజేపీ అభ్యర్థి జి కిషన్‌రెడ్డి అందుబాటులో లేకపోవటం వల్ల ప్రజలకు, ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం వాటిల్లుతూ ఉందని అభిప్రాయపడ్డారు. కిషన్ రెడ్డి ప్రజలకు అంతగా అందుబాటులో లేరని, ఇది ఆయన ఓటు బ్యాంకుపై ప్రభావం చూపవచ్చని అంచనా వేస్తున్నారు. సికింద్రాబాద్ సీటు గెలుస్తానని మాజీ మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 40 ఏళ్ల అనుభవజ్ఞుడు జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. సికింద్రాబాద్ లోక్‌సభ సెగ్మెంట్‌లో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండడంతో పార్టీ అఖండ మెజారిటీతో గెలుపొందుతుందని పద్మారావు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి ఎంతో ఆసక్తిగా ఉన్నామని అన్నారు. ఇక తమ రాజకీయ ప్రవేశాన్ని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయిస్తారని తెలిపారు. అప్పటి వరకు తమ కుటుంబం వేచి చూస్తుందని పద్మారావు చెప్పారు.
NM: ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది? ఇటీవల రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన BRS పట్ల పట్టణ ఓటర్ల స్పందన ఎలా ఉంది?
పద్మారావు: సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం హైదరాబాద్ నగరంలో ఒక భాగం. రాష్ట్ర ఎన్నికల్లో, సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఓటు వేశారు. హైదరాబాద్‌లో స్థిరపడిన తెలుగు వారు, దేశంలోని వివిధ ప్రాంతాల వారు గత 10 ఏళ్లలో బీఆర్‌ఎస్ చేసిన అభివృద్ధిని చూశారు. వారు BRS వెనుక ఉన్నారు. అందుకే హైదరాబాద్‌లో పార్టీ క్లీన్ స్వీప్ సాధించగలిగింది. ఇప్పుడు కూడా ఓటర్ల నుంచి మా పార్టీకి మంచి మద్దతు ఉంది.
NM: “పజన్న”, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ముద్దుగా ఇలా పిలుస్తూ ఉంటారు, 1986లో కార్పొరేటర్‌గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. రాజకీయాల్లోకి వచ్చి దాదాపు 40 సంవత్సరాలు. ఇప్పుడు 70 ఏళ్ల వయసులో రాష్ట్రం నుంచి జాతీయ రాజకీయాల్లోకి మారేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్టీ నాయకత్వం మిమ్మల్ని రంగంలోకి దించింది, అయితే సికింద్రాబాద్‌పై మీ విజన్, ప్రణాళికలను మాకు తెలియజేయగలరా?
పద్మారావు: రాష్ట్ర రాజకీయాల్లో నా పాత్ర గురించి మాట్లాడితే.. తెలంగాణ అసెంబ్లీకి మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా పనిచేయడమే కాకుండా 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను. నేను ఇప్పుడు (సికింద్రాబాద్ అసెంబ్లీ) ఎమ్మెల్యేని. అవిభక్త రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఒక సీనియర్ రాజకీయ నాయకుడు రాష్ట్రం నుంచి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం వస్తే నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే కాకుండా కేంద్రం నుంచి నిధులు, పథకాలు తదితరాలు అందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే రాష్ట్రం అభివృద్ధి కూడా జరుగుతుంది.
NM: సికింద్రాబాద్‌లో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఒక కేంద్ర మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారు. అయితే ఇది బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య ద్విముఖ పోరు అని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. మీరు ఏమనుకుంటున్నారు?
పద్మారావు: ప్రతి అభ్యర్థి తమకు మంచి విజయావకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు, కానీ ఆచరణాత్మకంగా చెప్పాలంటే మేము సికింద్రాబాద్‌లో BRS గెలుపుపై ఎంతో నమ్మకంతో ఉన్నాము. జి కిషన్‌రెడ్డికి విషయానికి వస్తే, గత ఐదేళ్లుగా కేంద్ర మంత్రి తమకు అందుబాటులో లేరని ప్రజలే మాకు చెప్పారు. ఎంపీల్యాడ్స్ (పార్లమెంటు సభ్యుడు స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం) నిధులు కూడా వినియోగించలేదు. క్షేత్రస్థాయిలోని బీజేపీ కార్యకర్తలు తమ పనికి గుర్తింపు లేదని, అందుకే ఈసారి ఆయనకు (కిషన్ రెడ్డిని ఉద్దేశించి) మద్దతు ఇవ్వడం లేదని బహిరంగంగా చెబుతున్నారు. తిరుమల దర్శనం కోసం ఎంపీ సిఫారసు లేఖను పొందడం కూడా తమకి సాధ్యం కాదని, లేఖల కోసం ఎమ్మెల్యేలను సంప్రదించాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. నా సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో కూడా, వివిధ బీజేపీ కార్యకర్తలకు సిఫారసు లేఖలు, కళాశాల అడ్మిషన్‌ల కోసం లేదా ఆలయ సందర్శనల కోసం రిఫరెన్స్ లెటర్‌ల కోసం నన్ను సంప్రదించారు. ఇది ఊరికే చెబుతున్న మాట కాదు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవం.
NM: సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లు (జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, అంబర్‌పేట్, ముషీరాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్, సనత్‌నగర్) కలిగి ఉంది. బీఆర్ఎస్ 5 నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు గెలిచారు.
పద్మారావు: ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదు నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌కు భారీ ప్రయోజనం ఉంది. జూబ్లీహిల్స్ నుంచి మాగంటి గోపీనాథ్, అంబర్‌పేట నుంచి కాలేరు వెంకటేశ్, ముషీరాబాద్ నుంచి ముటా గోపాల్, సనత్‌నగర్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్, సికింద్రాబాద్ నుంచి నేను గెలిచాం. మా అందరికీ స్థానికులు, ఓటర్లతో మంచి సంబంధాలు ఉన్నాయి. అందువల్ల, ఈ ప్రాంతంలో BRS ముందు ఉంది. అత్యధిక విజయావకాశాలను కలిగి ఉంది. ఇక దానం నాగేందర్ మా పార్టీ గుర్తుపై గెలుపొందడంతో ఖైరతాబాద్ కూడా బీఆర్‌ఎస్‌కే చెందుతుంది. దానం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆ పార్టీలి విధేయులుగా మారడం తెలిసిందే.
NM: సికింద్రాబాద్ లోక్‌సభలో ఓటర్ల సంఖ్య దాదాపు 21 లక్షలు. వీరిలో ముస్లిం ఓటర్లు 20 శాతానికి పైగా ఉన్నారు. సికింద్రాబాద్ సెగ్మెంట్‌కు సంబంధించి స్థానిక సమస్యలు, వాగ్దానాలకు సంబంధించి ప్రత్యేకంగా ఏదైనా మేనిఫెస్టోను సిద్ధం చేశారా?
పద్మారావు: బస్తీల్లో మీటింగులతో పాటు ఇంటింటికీ తిరుగుతున్నాం. ఇక్కడ ఓటర్లుగా ఉన్న మార్వాడీలు, సింధీలు, గుజరాతీలు తదితర వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తున్నాము. కానీ గమనించదగ్గ విషయం ఏమిటంటే, నేను నా రాజకీయ జీవితంలో మొదటి రోజు నుండి ఇక్కడ పని చేస్తున్నాను కాబట్టి ప్రపంచంలోని ఈ ప్రాంతంలోని ప్రజలకు నేను బాగా తెలుసు. ఉద్యమ కాలంలో అయినా, తెలంగాణ ఏర్పడిన తర్వాత అయినా నేను నా పార్టీకి విధేయుడిగా ఉన్నాను. పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడికి కట్టుబడి ఉన్న ఏ రాజకీయ నాయకుడిని అయినా ప్రజలు గుర్తించి గౌరవిస్తారు.
ప్రతి విభాగంలో ఎప్పటికీ సమస్యలనేవి ఉంటాయి. రోడ్లు, మురుగు కాల్వలు, లైటింగ్, నిరుద్యోగం, విద్య మొదలైనవి ఉన్నాయి. సమస్యలు వస్తాయి.. మేము వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని వివిధ సెగ్మెంట్లలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఎలాంటి సమస్య లేదని ప్రధాని కూడా చెప్పలేకపోతున్నారు.
NM: బీఆర్‌ఎస్ సుప్రీమో, మాజీ సీఎం కే చంద్రశేఖరరావు వివిధ సెగ్మెంట్లలో చేపట్టిన బస్సుయాత్ర ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. అయితే యాత్ర షెడ్యూల్ లో సికింద్రాబాద్ లేనట్లు తెలుస్తోంది.
పద్మారావు: బస్సుయాత్రలో భాగంగా కేసీఆర్ గారు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. షెడ్యూల్ టైట్‌గా ఉంది కాబట్టి ఇక్కడ ఆయన రోడ్ షోకి సమయం సరిపోయే అవకాశం లేదు. అయితే సికింద్రాబాద్‌లో ఆయన (కేసీఆర్‌ని ఉద్దేశించి) రోడ్‌షో నిర్వహించే అవకాశం ఏమైనా ఉందా అనేది చూడాలి. లేకుంటే కేటీఆర్, హరీష్‌లు కూడా ప్రచారంలో పాల్గొంటారు. సార్వత్రిక ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో కేటీఆర్ హైదరాబాద్‌లో విస్తృతంగా పర్యటించారు.
NM: 2023 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత, BRS కఠినమైన దశను ఎదుర్కొంటోంది. ఎన్నికైన ప్రజాప్రతినిధులు కె.కేశవరావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్ రావు వంటి పలువురు నాయకులు పార్టీలు మారిపోయారు. పార్టీ భవిష్యత్తుకు లోక్‌సభ ఎన్నికలు ఎంత కీలకం?
పద్మారావు: ప్రభుత్వంలో కీలక పదవులు, పార్టీలో ప్రాధాన్యత ఉన్న ఈ నేతలు బీఆర్‌ఎస్‌కు దూరమయ్యారు. కడియం పర్యటనకు వెళ్లిన కొన్ని గ్రామాలలో బహిరంగంగా వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన సొంత నియోజకవర్గంలోనే వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. గత కొంతకాలంగా బీఆర్‌ఎస్‌లో ఉన్న నాగేందర్ సికింద్రాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచారు. కొందరు నేతలు మాత్రమే పార్టీలు మారడం గమనించాలి. అయితే ఇప్పటికీ బీఆర్‌ఎస్‌తో ప్రజలు కొనసాగుతూ ఉన్నారు. ప్రజల మద్దతు విషయంలోనూ, ద్వితీయ శ్రేణి నాయకుల్లోనూ ఎలాంటి మార్పు లేదు.
గెలుపు ఓటములు మన చేతుల్లో లేదు. మా అధ్యక్షుడు (కె చంద్రశేఖర్‌రావును ఉద్దేశించి) చేపట్టిన బస్సుయాత్ర చూస్తుంటే అన్ని చోట్లా జనం భారీగా తరలివస్తున్నారు. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తీసుకుని వచ్చిన మేనిఫెస్టోను అమలు చేయడం కష్టమేనని తేలింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కనిపిస్తున్నది అదే. ఆదాయం లేనందున అనేక ఎన్నికల హామీలను నెరవేర్చలేదు. నాకు ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉంది. బడ్జెట్, ఆర్థిక విషయాల గురించి నాకు ఒక ఆలోచన ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా, ఎమ్మెల్యేగా పనిచేశాను. కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని ఎన్నికల హామీలను అమలు చేయలేకపోయింది. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి ఎలాగైనా అధికారంలోకి రావడమే కాంగ్రెస్ ఏకైక లక్ష్యం.
NM: పద్మారావు తన రాజకీయ జీవితంలో గౌరవప్రదమైన స్థానానికి చేరుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన మీ సహచరులను చూస్తే, వారిలో చాలా మంది తమ కొడుకులు లేదా కుమార్తెలను రాజకీయ వారసులుగా తీసుకువచ్చి ఎన్నికలలో నిలబెడుతున్నారు. మీకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మీ అడుగుజాడల్లో మీ పిల్లలను రాజకీయాల్లోకి తీసుకురావాలనుకుంటున్నారా?
పద్మారావు: ఇది నా చేతుల్లో లేదు, నా పార్టీ అధిష్టానం దీనిపై నిర్ణయం తీసుకోవాలి. తండ్రి రాజకీయవేత్త అయినప్పుడు, అతని పిల్లలకు కూడా రాజకీయ ఆశయాలు ఉండటం చాలా సాధారణం. వ్యాపారవేత్త పిల్లలు వ్యాపారంలోకి ప్రవేశించి, తమ తండ్రిలాగా దాన్ని మరింత పెద్ద ఎత్తుకు తీసుకెళ్లాలని కోరుకుంటారు. ఈ విషయంలో ఎవరూ తప్పు పట్టలేరు. రాజకీయ కుటుంబాలకు చెందిన పిల్లల సామర్థ్యం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎంతో మంది వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడతారు. నా పిల్లలు కూడా ఇతర నాయకుల పిల్లల లాగా రాజకీయాల్లోకి రావచ్చు. ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 153కి పెరిగే అవకాశం ఉన్నందున 2026లో డీలిమిటేషన్ కసరత్తు చేపట్టే అవకాశం ఉంది.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న నియోజకవర్గాల డీలిమిటేషన్‌తో కొత్త నియోజకవర్గాలు రానున్నాయి. నా పిల్లలే కాదు, రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల పిల్లలకు కూడా రాజకీయ అవకాశాలు లభిస్తాయి. అయితే తుది నిర్ణయం మాత్రం నా పార్టీ అధినేతదేనని చెప్పాలని అనుకుంటూ ఉన్నాను.