తెలంగాణ పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగింది
People have more faith in the police says DGP Mahender Reddy.తెలంగాణ రాష్ట్రంలోని పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగిందని డీజీపీ మహేందర్
By తోట వంశీ కుమార్
తెలంగాణ రాష్ట్రంలోని పోలీసులపై ప్రజలకు నమ్మకం పెరిగిందని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాష్ట్ర పోలీసు వార్షిక నేర నివేదిక-2021ని విడుదల చేశారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సమయంలో పోలీసులు బాధ్యతాయుతంగా పని చేశారని, అన్నివిభాగాలను సమన్వయం చేస్తూ ప్రజలకు సేవలందించారన్నారు. ప్రజల నుంచి పోలీసులకు మంచి పేరు లభించిందని, నమ్మకం పెరిగిందన్నారు.
ఈ సంవత్సరం శాంతి భద్రతల సమస్య ఎక్కడా రాలేదన్నారు. నేరాల నియంత్రణ, నిందితులను పట్టుకోవడంతో మంచి ఫలితాలు సాధించినట్లు చెప్పారు. రాష్ట్రాన్ని నేర, మావోయిస్టు రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. 98 మంది మావోలను అరెస్ట్ చేయగా.. 133 మంది మావోలు జనజీవన స్రవంతిలో కలిశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత ఎలాంటి మత ఘర్షణలు జరగలేదన్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో చిన్న గొడవలు జరిగాయన్నారు. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ 4.5శాతం పెరిగిందన్నారు. నేరస్థులకు శిక్షలు పడేలా పోలీస్ శాఖ పనితీరు, పోలీస్ స్టేషన్ లలోని కోర్టు అధికారుల పని తీరుకు అభినందనలు తెలిపారు.
సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. 800 పోలీస్ స్టేషన్లలో రిసెష్పన్ కౌంటర్లు ప్రారంభించామన్నారు. షీటీమ్స్ సమర్థంగా పని చేసి 5,145 మంది బాధితులకు న్యాయం చేసిందన్నారు. రహదారి ప్రమాదాల్లో 6,690 మంది చనిపోయారని, ట్రాఫిక్ ఉల్లంఘనల పై రూ.879 కోట్ల జరిమానా విధించినట్లు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్ర పోలీసులకు 11 జాతీయ అవార్డులు వచ్చాయన్నారు.