Telangana: పెంబర్తి, చంద్లాపూర్ గ్రామాలకు అరుదైన గుర్తింపు
జాతీయ స్థాయిలో తెలంగాణ గ్రామాలకు మరో గుర్తింపు లభించింది. చంద్లాపూర్, పెంబర్తి జాతీయ ఉత్తమ టూరిజం విలేజి అవార్డులకు ఎంపికయ్యాయి.
By అంజి Published on 26 Sept 2023 8:00 AM ISTTelangana: పెంబర్తి, చంద్లాపూర్ గ్రామాలకు అరుదైన గుర్తింపు
ఇప్పటికే ఎన్నో జాతీయ అవార్డులు గెలుచుకున్న తెలంగాణకు మరో జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. తెలంగాణలోని రెండు గ్రామాలు జాతీయ ఉత్తమ టూరిజం విలేజి అవార్డులకు ఎంపికయ్యాయి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని గ్రామీణ పర్యాటకం కోసం కేంద్ర నోడల్ ఏజెన్సీ రెండు గ్రామాలను - జనగాం జిల్లాలోని పెంబర్తి, సిద్దిపేటలో చిన్నకోడూర్ మండలంలో చంద్లాపూర్ గ్రామాలను - ఉత్తమ గ్రామీణ పర్యాటక గ్రామాలుగా గుర్తించింది. పెంబర్తి కాకతీయ రాజవంశం కాలం నుండి హస్తకళలు, లోహపు పనులకు ప్రసిద్ధి చెందింది. చంద్లాపూర్ దాని క్లిష్టమైన చేనేత వస్త్రాలకు, ముఖ్యంగా 'గొల్లభామ' చీరలకు ప్రసిద్ధి చెందింది.
జాతీయ పర్యాటక శాఖ ఉత్తమ టూరిజం విలేజి అవార్డ్ లను ప్రతి ఏటా ఇస్తుంది. దేశం మొత్తం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఈ అవార్డు కోసం 795 గ్రామాలు తమ అప్లికేషన్స్ పంపించాయి. ఇందులో తెలంగాణలోని చంద్లాపూర్ గ్రామంతో పాటు పెంబర్తి కూడా ఎంపికయ్యింది. ప్రపంచ పర్యాటక దినోత్సవమైన సెప్టెంబర్ 27న న్యూఢిల్లీలో ఈ అవార్డులను అందజేయనున్నారు. నవంబర్ 2021లో యూఎన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) ద్వారా పోచంపల్లి ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు పొందింది.
పెంబర్తి
పెంబర్తి గ్రామం.. హస్తకళలకు ప్రసిద్ధి చెందింది. దేశంలోనే బెస్ట్ టూరిజమ్ విలేజ్‌గా ఎంపికైంది. జనగామ జిల్లా జనగామ మండలం పెంబర్తి గ్రామంలో కాకతీయ కాలం నుంచీ హస్తకళలతో పేరుగాచింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ముఖద్వారమైన ఈ గ్రామంలో తయారయ్యే వెండి, ఇత్తడి, కంచు కళారూపాలకు అంతర్జాతీయంగా ప్రాచుర్యం ఉంది. అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ తదితర దేశాలు ఇక్కడి కళాకృతులను ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. మన సంస్కృతీ సంప్రదాయలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా కళాకృతులు, దేవతల విగ్రహాలు, కళాఖండాలు, గృహాలంకరణ వస్తువులులెన్నో ఇక్కడి కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకుంటాయి. ఇక్కడి విశిష్టతను తెలుసుకునేందుకు ఏటా 25వేలమంది పర్యాటకులు పెంబర్తికి వస్తున్నట్లు కేంద్రం ప్రభుత్వం లెక్కలు చెబుతున్నాయి.
మరో అద్భుతమైన డెస్టినేషన్ చంద్లాపూర్
సిద్దిపేట జిల్లాలోని చంద్లాపూర్ గ్రామం మరో అద్భుతమైన టూరిస్ట్ డెస్టినేషన్‌గా మారింది. ఈ ప్రాంతంలో నేసే 'గొల్లభామ' చీరలు తెలంగాణ కళాసంస్కృతికి ప్రతిబింబాలు. గొల్లభామ చీర తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యానికి నిలువుటద్దంగా నిలుస్తోంది. నెత్తిన చల్లకుండ, చేతిలో పెరుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నెత్తిన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం ఈ చీరల్లో ఇమిడిపోయి కనిపిస్తుంది. సిద్దిపేట ప్రాంతంలో చంద్లాపూర్ కనువిందు ప్రకృతి అందాలు, జల సందడి చేసే గొప్ప పర్యాటక ప్రాంతం రంగనాయక సాగర్.. ఈ ప్రాంతం సొంతం. టూరిజం అవార్డు రావడం పట్ల మంత్రి హరీశ్ రావు చంద్లాపూర్ గ్రామ పంచాయతీకి, గ్రామ ప్రజలకు అభినందనలు తెలిపారు. సిద్దిపేట పర్యాటక, ఆహ్లాదకరమైన ప్రాంతంగా నెలవు అనడానికి గొప్ప నిదర్శనం నేడు జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతంగా చంద్లాపూర్ గ్రామం ఎంపిక అని ఆయన అభిప్రాయపడ్డారు.