అవి ఓఆర్‌ఎస్‌లు కాదు.. పిల్లల ప్రాణాలతో చెలగాటమొద్దు.. డాక్టర్ శివరంజని హెచ్చరిక!
పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఎండాకాలంలో హైడ్రేషన్ పేరుతో ఇచ్చే పానీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని...
By - అంజి |
అవి ఓఆర్‌ఎస్‌లు కాదు.. పిల్లల ప్రాణాలతో చెలగాటమొద్దు.. డాక్టర్ శివరంజని హెచ్చరిక!
పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఎండాకాలంలో హైడ్రేషన్ పేరుతో ఇచ్చే పానీయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ ఎం. శివరంజని సంతోష్ హెచ్చరించారు. మార్కెట్లో లభించే అనేక కమర్షియల్ ‘హైడ్రేషన్’ ప్రొడక్ట్స్ డయేరియా (విరేచనాలు) వంటి సమస్యలను మరింత తీవ్రం చేస్తాయని ఆమె స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. డబ్ల్యూహెచ్‌ఓ (WHO) సూచించిన ఓఆర్ఎస్ (ORS) ప్రాణ రక్షకమని, అయితే దానికి బదులుగా మార్కెట్లో అనేక చక్కెరతో కూడిన ఎలక్ట్రోలైట్ డ్రింక్స్‌ను తప్పుదోవ పట్టించేలా విక్రయిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ORS మరియు కమర్షియల్ డ్రింక్స్ మధ్య తేడాలను వివరిస్తూ.. పిల్లలకు రోజువారీ హైడ్రేషన్ కోసం ప్రత్యేకంగా ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ అవసరం లేదని డాక్టర్ తెలిపారు. పిల్లలు ఎండలో ఎక్కువగా ఆడుకున్నా లేదా తీవ్రమైన శారీరక శ్రమ చేసినప్పుడు తప్ప, సాధారణ నీరు మరియు పోషకాహారం సరిపోతాయని వివరించారు. ముఖ్యంగా సుక్రలోజ్ వంటి చక్కెరలు ఎక్కువగా ఉండే పానీయాలు విరేచనాల సమయంలో ఇస్తే, అవి ప్రేగుల్లోని నీటిని బయటకు లాగి డీహైడ్రేషన్‌ను (నిర్జలీకరణం) పెంచుతాయని, తద్వారా పిల్లలు ఆసుపత్రి పాలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
నియంత్రణ సంస్థలైన FSSAI మరియు CDSCO మధ్య ఉన్న నిబంధనల లొసుగులను కొన్ని కంపెనీలు తమ లాభాల కోసం వాడుకుంటున్నాయని డాక్టర్ శివరంజని ఆరోపించారు. సాధారణ WHO ఫార్ములా ORS కంటే ఈ కమర్షియల్ డ్రింక్స్‌పై లాభాలు ఎక్కువగా ఉండటంతో, ఫార్మసీలు కూడా తల్లిదండ్రులు ORS అడిగినా వీటినే అంటగడుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో పారదర్శకత కోసం తాను పోరాడుతున్నానని, దీనిపై తెలంగాణ హైకోర్టులో పిల్ (PIL) కూడా దాఖలు చేశానని ఆమె వెల్లడించారు.
తల్లిదండ్రుల కోసం సూచనలు:
లేబుల్ చెక్ చేయండి: ప్యాకెట్‌పై ‘WHO Recommended Formula’ అని ఉందో లేదో ఖచ్చితంగా చూడాలి.
బ్రాండ్ల మాయలో పడకండి: ‘డైలీ హైడ్రేషన్’ అని ప్రచారం చేసే పానీయాలను విరేచనాల సమయంలో వాడకండి.
ఫార్మసీలో జాగ్రత్త: మీరు ORS అడిగినప్పుడు ఫార్మసిస్ట్ ఇచ్చే ప్యాకెట్‌ను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి. ప్రత్యామ్నాయాలను అంగీకరించకండి.