మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూశారు.
By Srikanth Gundamalla Published on 5 Feb 2024 10:56 AM ISTమాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో ఆయన కొంతకాలంగా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. 1930లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన ఎమ్మెల్యే స్థాయి వరకు ఎదిగారు.
మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు రాజకీయ ప్రస్థానం టీడీపీలో మొదలైంది. ఆయన తర్వాత ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఆయన కాంగ్రెస్‌లో చేరారు. సుల్తానాబాద్‌కు చెందిన బిరుదు రాజమల్లు 1930లో జన్మించారు. మొదట ఆయన సుల్తానాబాద్ పీఏసీఎస్ చైర్మన్ గా ఎన్నిక అయ్యారు. ఆ తర్వాత 1989లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేవారు. అయితే.. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డి చేతిలో ఓడిపోయారు.
1994లో మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచే బరిలోకి దిగారు. అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి గీట్ల ముకుందారెడ్డిపై 39,677 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తద్వారా తొలిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇక ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత 2018లో టీడీపీని విడిచిపెట్టి బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్)లో చేరారు. ఇక 2023 ఎన్నికలకు ముందే మరోసారి పార్టీ మారారు. కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రస్తుత ఎమ్మెల్యే విజయ రమణారావు గెలుపులో కీలక పాత్ర పోషించారు బిరుదు రాజమల్లు. ఇక రాజమల్లు మరణం పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.