నేటి నుంచే పెద్దగ‌ట్టు జాత‌ర‌.. ముస్తాబైన లింగమంతుల ఆలయం.. ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు

Peddagattu Jatara starts from today.శ్రీ లింగ‌మంతుల స్వామి(పెద్ద‌గ‌ట్టు) జాత‌ర నేటి(ఆదివారం) నుంచి ప్రారంభం కానుంది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 Feb 2023 10:11 AM IST
నేటి నుంచే పెద్దగ‌ట్టు జాత‌ర‌.. ముస్తాబైన లింగమంతుల ఆలయం.. ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు

తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాత‌ర అయిన శ్రీ లింగ‌మంతుల స్వామి(పెద్ద‌గ‌ట్టు) జాత‌ర నేటి(ఆదివారం) నుంచి ప్రారంభం కానుంది. ప్ర‌తి రెండు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి జాత‌ర‌ను అంగ‌రంగ‌ వైభంగా నిర్వ‌హిస్తారు. నేటి నుంచి ప్రారంభ‌మ‌య్యే జాత‌ర ఫిబ్రవరి 9 వరకు సాగ‌నుంది. ఆదివారం అర్థ‌రాత్రి సూర్యాపేట మండ‌లం కేసారం నుంచి దేవ‌ర‌పెట్టె రావ‌డంతో జాత‌ర ప్రారంభం అవుతుంది.

స్వామివారిని ద‌ర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచే కాకుండా మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, చ‌త్తీస్ గ‌ఢ్‌, త‌మిళ‌నాడు, ఒడిశా రాష్ట్రాల నుంచి భ‌క్తులు వ‌స్తుంటారు. ప్ర‌తీ ఏటా భ‌క్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ సారి స్వామి వారి ద‌ర్శ‌నానికి 15 నుంచి 20ల‌క్ష‌ల మంది భ‌క్తులు వ‌స్తార‌ని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు త‌గ్గ ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఐదు రోజుల జాతర ఇలా..

లింగమంతులస్వామి జాతర మొదటి రోజైన ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమవుతుంది. అర్ధరాత్రి యాదవ భక్తులు బోనాలు, గంపలతో ప్రదక్షిణలు చేస్తారు. రెండో రోజైన సోమవారం చౌడమ్మ తల్లికి బోనాలు, మూడో రోజు మంగళవారం లింగమంతులస్వామి గుడి ముందు చంద్రపట్నం వేస్తారు. నాలుగో రోజు బుధవారం నెల వారం వేస్తారు. చివరి రోజైన ఐదో రోజు గురువారం దేవరపెట్టెకు పూజలు చేసి కేసారం తరలించడం ద్వారా జాతర ముగుస్తుంది.

ప్ర‌త్యేక బ‌స్సులు..

జాతర కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ‌(టీఎస్ ఆర్టీసీ) ప్రత్యేక చర్యలు చేపట్టింది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను న‌డ‌ప‌నుంది. ఉమ్మడి నల్గొండతో పాటు మిగిలిన ప్రాంతాల నుంచి భ‌క్తులు పెద్ద ఎత్తున స్వామివారిని ద‌ర్శించుకునే అవ‌కాశం ఉండ‌డంతో అందుకు త‌గిన ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు. సూర్యాపేట డిపో నుంచి 60, కోదాడ నుంచి 20, మిర్యాలగూడ డిపో నుంచి 8 బస్సులను జాతరకు నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.

సూర్యాపేట డిపో నుంచి జాత‌ర స‌మీపంలోని దురాజ్‌ప‌ల్లి బ‌స్టాండ్‌కు పెద్ద‌ల‌కు రూ.30, పిల్ల‌ల‌కు రూ.20 టికెట్‌గా నిర్ణ‌యించారు.

ట్రాఫిక్ ఆంక్ష‌లు..

హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ, విజ‌య‌వాడ నుంచి హైద‌రాబాద్‌కు వెళ్లే ప్ర‌యాణీకులు, వాహ‌నాల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు సూర్యాపేట వ‌ద్ద ట్రాఫిక్ మ‌ళ్లింపు ఉంటుంద‌ని పోలీసులు తెలిపారు.

- హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద జాతీయ రహదారి 65 నుంచి ఖమ్మం వెళ్లే జాతీయ రహదారి 365-బీ మీదుగా మళ్లిస్తారు. రాఘవాపురం స్టేజీ నుంచి నామవరం మీదుగా జాతీయ రహదారి 65పై గుంజలూరు స్టేజీ వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపు పంపిస్తారు.

-హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే భారీ వాహనాలు, ట్రాన్స్‌పోర్టు వాహనాలను టేకుమట్ల నుంచి జాతీయ రహదారి 365-బీ మీదుగా నాయకన్‌గూడెం నుంచి కోదాడ వైపు మళ్లిస్తారు.

- విజయవాడ నుంచి సూర్యాపేట మీదుగా హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను జాతీయ రహదారి 65పై స్వామి నారాయణ్‌ గురుకుల్‌ స్కూల్‌ ఎదురుగా ఉన్న ఎస్సారెస్పీ కెనాల్‌ రోడ్డు మీదుగా ఖమ్మం జాతీయ రహదారి 365-బీ రోళ్లబండతండా వరకు మళ్లించి జాతీయ రహదారి రాయనిగూడెం వద్ద యూటర్న్‌ చేసి హైదరాబాద్‌ వైపు పంపిస్తారు.

- విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే భారీ వాహనాలు, ట్రాన్స్‌పోర్టు వాహనాలను కోదాడ, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కట్‌పల్లి మీదుగా మళ్లిస్తారు.

- కోదాడ, మునగాల, గుంపుల మీదుగా సూర్యాపేట పట్టణానికి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర చిన్న ప్రజా రవాణా వాహనాలను ఎస్సారెస్పీ కెనాల్‌ నుంచి బీబీగూడెం మీదుగా సూర్యాపేట పట్టణానికి పంపిస్తారు.

- సూర్యాపేట పట్టణం నుంచి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రజా రవాణా వాహనాలను కుడకుడ గ్రామం మీదుగా ఐలాపురం, రాఘవాపురం స్టేజీ, నామవరం మీదుగా గుంజలూరు స్టేజీ వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపు పంపిస్తారు.

ఆదివారం తెల్ల‌వారుజాము నుంచి 9వ తేదీ సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఈ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని పోలీసులు తెలిపారు.

Next Story