కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య రినికి భుయాన్ శర్మపై చేసిన ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు...
By - అంజి |
కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టులో ఊరట
హైదరాబాద్: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్య రినికి భుయాన్ శర్మపై చేసిన ఆరోపణల నేపథ్యంలో నమోదైన కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు తెలంగాణ హైకోర్టు ఊరటనిచ్చింది. ఆయనకు ఒక వారం రోజుల పాటు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ జస్టిస్ కె. సుజన నేతృత్వంలోని బెంచ్ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ గడువులోగా సంబంధిత కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందాలని న్యాయమూర్తి సూచించారు.
హైదరాబాద్ నివాసిగా ఉన్న ఖేరా, తనపై అస్సాంలో నమోదైన కేసులో అరెస్టు కాకుండా రక్షణ కల్పించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పవన్ ఖేరా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని, కేవలం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చేసిన వ్యాఖ్యలకే సాధ్యమైనన్ని కఠిన సెక్షన్లు నమోదు చేయడం వేధింపుల కిందకే వస్తుందని పేర్కొన్నారు.
ఏప్రిల్ 5న జరిగిన విలేకరుల సమావేశంలో పవన్ ఖేరా మాట్లాడుతూ.. రినికి భుయాన్ శర్మకు ఒకటి కంటే ఎక్కువ పాస్‌పోర్టులు ఉన్నాయని, ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించని విదేశీ ఆస్తులు ఉన్నాయని ఆరోపించారు. ఈ ఆరోపణలను శర్మ కుటుంబం తీవ్రంగా ఖండించింది. ముఖ్యమంత్రి భార్య ఫిర్యాదు మేరకు గౌహతి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు భారతీయు న్యాయ సంహిత (BNS) కింద ఫోర్జరీ, మోసం వంటి సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో అస్సాం పోలీసులు ఇప్పటికే ఢిల్లీలోని ఖేరా నివాసంలో సోదాలు నిర్వహించి, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తాజా కోర్టు తీర్పుతో పవన్ ఖేరాకు వారం రోజుల పాటు అరెస్టు నుండి రక్షణ లభించింది.