హైదరాబాద్: బతికి ఉండగానే రోగిని మార్చురీలో పెట్టారు ఆస్పత్రి సిబ్బంది. ఈ ఘటన మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. చిన్నగూడురు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ అయిన రాజు కిడ్నీ సమస్యతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లాడు. అయితే ఆధార్, అటెండెంట్ లేకపోవడంతో సిబ్బంది అతడిని చికిత్స చేసేందుకు చేర్చుకోలేదు. రెండు రోజులుగా అక్కడే ఉంటున్న రాజు నీరసంతో పడిపోయాడు. ఈ క్రమంలోనే అతడు చనిపోయాడనుకుని మార్చురీలో పెట్టారు.   
గుర్తు తెలియని శవమని భావించి రాత్రంతా మార్చురీలోనే పెట్టి తాళం వేసి వెళ్లిపోయారు. ఉదయం స్వీపర్లు మార్చురీ శుభ్రం చేస్తుండగా.. రోగి కదలికలను గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. రోగికి వైద్యం చేయించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు. ఆధార్, అటెండెంట్ లేకున్నా చికిత్స అందిస్తామని ఆర్‌ఎంవో తెలిపారు. రోగికి సిబ్బంది చికిత్స ఎందుకు చేయలేదో తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.