బస్సులో దొరికిన కోడిపుంజు.. వేలానికి పిలిచిన ఆర్టీసీ అధికారులు
కరీంనగర్ ఆర్టీసీ డిపోలో కోడిపుంజు వ్యవహారం ఆసక్తికరంగా మారింది.
By Srikanth Gundamalla Published on 11 Jan 2024 5:10 PM ISTబస్సులో దొరికిన కోడిపుంజు.. వేలానికి పిలిచిన ఆర్టీసీ అధికారులు
కరీంనగర్ ఆర్టీసీ డిపోలో కోడిపుంజు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. రెండ్రోజుల క్రితం కరీంనగర్ డిపోకు చెందిన బస్సులో ఓ ప్రయాణికుడు కోడిపుంజును మర్చిపోయాడు. అయితే.. దానికోసం సదురు ప్రయాణికుడు తిరిగి వస్తాడేమో అని అధికారులు ఎదురుచూశారు. రెండ్రోజుల పాటు జాగ్రత్తగా చూసుకున్నారు. గురువారంతో మూడ్రోజులు పూర్తి కావొస్తున్నా ఎవరూ కోడిపుంజుని తీసుకెళ్లేందుకు రాలేదు. దాంతో.. ఆర్టీసీ సిబ్బంది ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. కోడిపుంజుని వేలం వేసేందుకు సిద్ధం అయ్యారు. జవనరి 12న వేలం వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కరీంనగర్ ఆర్టీసీ డిపో అధికారులు ప్రకటన జారీ చేశారు. ఆసక్తి ఉన్నవారు వేలం పాటలో పాల్గొని కోడిపుంజుని సొంతం చేసుకోవాలని కరీంనగర్-2 డిపో మేనేజర్ పేరిట ప్రకటన విడుదల అయ్యింది.
జనవరి 9వ తేదీన వరంగల్ నుంచి ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు వేములవాడకు వెళ్లింది. అక్కడ ప్రయాణికులను దించేసి తిరిగి కరీంనగర్ డిపోకు చేరుకుంది. అయితే..డిపోలో బస్సును కాసేపు నిలిపిన తర్వాత డ్రైవర్, కండక్టర్ బస్సు కోడి ఉన్నట్లు గుర్తించారు. కోడిపుంజును ఓ ప్రయాణికుడు సంచిలో తీసుకెళ్తూ మర్చిపోయాడని డిపో అధికారులకు తెలిపారు. ఇక ఆ కోడిపుంజు కోసం తిరిగి ఆ ప్రయాణికుడు వస్తాడని భావించారు అధికారులు. దానిని రెండ్రోజుల పాటు ఒక జాలీలో ఉంచి భద్రంగా చూసుకున్నారు. కోడిపుంజకు అవసరమైన ఆహారాన్ని కూడా అందించారు. మూడ్రోజులు పూర్తవుతున్నా ఎవరూ రాకపోవడంతో ఆర్టీసీ డిపో అధికారులు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఈ సంఘటకు సంబంధించిన వార్త కరీంనగర్ జిల్లాలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. కోడిపుంజుని రెండ్రోజుల పాటు జాగ్రత్తగా చూసుకోవడంతో పాటు.. ఇప్పుడు ఆర్టీసీ అధికారులు వేలం వేస్తున్న వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇక సంక్రాంతి పండగ నేపథ్యంలో పలువురు ఈ వేలంలో పాల్గొంటారని అధికారులు భావిస్తున్నారు.