లవ్‌ మ్యారేజ్‌ చేసుకుందని కూతురికి శిరోముండనం.. జగిత్యాలలో తల్లిదండ్రుల పైశాచికం

Parents who beat their daughter badly for marrying love in Jagityal. తమ ఇష్టాన్ని కాదని, వేరే యుకుడిని పెళ్లి చేసుకుందని కూతురి పట్ల తలిదండ్రులు అతి క్రూరంగా ప్రవర్తించారు.

By అంజి  Published on  15 Nov 2022 10:28 AM IST
లవ్‌ మ్యారేజ్‌ చేసుకుందని కూతురికి శిరోముండనం.. జగిత్యాలలో తల్లిదండ్రుల పైశాచికం

తమ ఇష్టాన్ని కాదని, వేరే యుకుడిని పెళ్లి చేసుకుందని కూతురి పట్ల తలిదండ్రులు అతి క్రూరంగా ప్రవర్తించారు. కన్న కూతురు అన్న విషయాన్ని మరిచి ఆమెకు కోలుకోలేని గాయాన్ని చేశారు. అత్తవారింటి నుంచి కూతురిని అపహరించి.. తీవ్రంగా కొట్టుకుంటూ కారులో తీసుకెళ్లారు. ఆపై పైశాచికంగా ప్రవర్తించి కూతురికి శిరోముండనం చేశారు. ఆమె మనసును మార్చేందుకు శతవిథాలా ప్రయత్నించారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో చివరకు వదిలి పెట్టారు. ఈ ఘటన తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

తల్లిదండ్రుల హింసలు భరించలేకపోయినా యువతి పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కింది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. జగిత్యాల జిల్లా బాలపల్లికి చెందిన జక్కుల మధు(23), రాయికల్‌ మండలం ఇటిక్యాలకు చెందిన జువ్వాజి అక్షిత(20) లవ్‌ చేసుకున్నారు. అయితే వారి పెళ్లికి యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో వారు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత అక్షిత తన అత్తవారి ఇంట్లో ఉండసాగింది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం రెండు కార్లలో వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు మధు కుటుంబంపై దాడిచేశారు.

అక్షితను బలవంతంగా కిడ్నాప్‌ చేశారు. కారులో తీసుకెళ్తూ వారు యువతిని తీవ్రంగా కొడుతూ హింసించారు. అక్షిత గట్టిగా కేకలు వేస్తున్నా వదలకుండా శిరోముండనం చేశారు. ఆ తర్వాత రోజు యువతి జగిత్యాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. జరిగిన ఘాతుకాన్ని పోలీసులకు తెలపడంతో.. ఎస్సై అనిల్‌ న్యాయం చేస్తామని బాధితురాలికి హామీ ఇచ్చారు. యువతిని భర్తకు అప్పగించామని తెలిపారు. ఆమె తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Next Story