పందెం రాయుళ్ల దెబ్బకు స్వేచ్ఛగా ఆరు బయట తిరుగుతూ ఇష్టమైన ఆహారం తినాల్సిన కోళ్లు ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నాయి. గుట్టుగా కోడి పందాలు నిర్వహిస్తూ పందెం రాయుళ్లు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వారితో పాటు ఇప్పుడు కోడిపుంజులు కటకటాల పాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని బాణాపురం గ్రామంలో కొందరు యువకులు ఆంధ్ర యువకులతో కోడిపందాలు నిర్వహిస్తున్నారు. కోడి పందాలపై సమాచారం అందుకున్న పోలీసులు పందెం స్థావరాలపై దాడులు చేసి యువకులతో పాటు నగదు, రెండు కోళ్లను అదుపులోకి తీసుకున్నారు.
కోళ్లను పోలీస్ స్టేషన్ లోని లాకప్ లో ఉంచారు. పోలీస్ సిబ్బందే వాటికి సమయానికి నీరు, ఆహారం అందిస్తున్నారు. రాత్రి డ్యూటిలో ఉన్న సెంట్రీలకు నిద్ర పడితే.. తెల్లవారుజామున తమ కోడికూతలతో లేపేస్తున్నాయి. దాదాపు ఇవి 20 రోజులుగా లాకప్‌లోనే ఉంటున్నాయి. పాపం ఇవి ఏ జన్మలో జైలు జీవితం అనుభవించకుండా తప్పించుకున్నాయో.. ఈ జన్మలో ఇలా జైలులో శిక్ష అనుభవిస్తున్నాయని అక్కడి వచ్చిన వాళ్లు అనుకుంటున్నారు. నిబంధన ప్రకారం వీటిని సెల్ లో ఉంచామని కోర్టు నుంచి ఆదేశాలు వచ్చేవరకు ఉంచుతామని ఏస్ఐ చెబుతున్నారు.