Sangareddy: అంగన్‌వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు

సంగారెడ్డి జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త చేసిన ఆర్థిక మోసానికి భార్యను బాధ్యురాలిని చేస్తూ...

By -  అంజి
Published on : 10 April 2026 9:30 AM IST

Sangareddy Anganwadi Teacher Humiliation, Financial Fraud Mob Justice Telangana, HBM Finance Scam Prabhakar, Villagers Arrested in Sangareddy, Vigilantism Against Women, Kangti Mandal Incident, Law and Order Telangana Police

Sangareddy: అంగన్‌వాడీ టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్థులు

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త చేసిన ఆర్థిక మోసానికి భార్యను బాధ్యురాలిని చేస్తూ గ్రామస్థులు ఆమెను బహిరంగంగా అవమానించారు. కంగ్టి మండలం రసోల్ గ్రామంలో విధుల్లో ఉన్న వసంత కుమారి అనే అంగన్‌వాడీ టీచర్‌ను ఒక గుంపు అడ్డగించి, బలవంతంగా చెట్టుకు కట్టేసి వేధించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలి భర్త ప్రభాకర్ 'హెచ్‌బిఎమ్ ఫైనాన్స్' (HBM Finance) పేరుతో ఒక సంస్థను నడిపేవాడు. అతడు రామరాగిడ్డ గ్రామస్థుల నుండి భారీగా నగదు వసూలు చేసి, ఆపై మోసం చేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. తమ డబ్బు పోయిందన్న కోపంతో ఉన్న గ్రామస్థులు, ప్రభాకర్ చిక్కకపోవడంతో అతని భార్య వసంత కుమారిపై దాడికి దిగారు. బుధవారం ఆమె విధుల్లో ఉండగా రసోల్ గ్రామానికి చేరుకున్న బాధితులు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఆమెను తాళ్లతో చెట్టుకు కట్టేసి తీవ్రంగా అవమానించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి కేసు నమోదు చేశారు. ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఆర్థిక వివాదాలు ఉంటే చట్టపరమైన మార్గాల్లో పరిష్కరించుకోవాలి తప్ప, మహిళలపై ఇటువంటి దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు. అజ్ఞాతంలో ఉన్న ప్రధాన నిందితుడు ప్రభాకర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Next Story