వాహనదారులకు అలర్ట్.. పెండింగ్ చలాన్ల ఆఫర్‌కు రేపే లాస్ట్ డేట్!
రాయితీల ద్వారా పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవడానికి మరో ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది.
By Srikanth Gundamalla Published on 9 Jan 2024 3:07 PM ISTవాహనదారులకు అలర్ట్.. పెండింగ్ చలాన్ల ఆఫర్‌కు రేపే లాస్ట్ డేట్!
తెలంగాణలో ఉన్న వాహనదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. అదే పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు సువర్ణావకాశం కల్పించింది. 80 శాతం రాయితీలు కల్పిస్తూ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో భారీ ఎత్తున పెండింగ్ చలన్లు పేరుకుపోవడంతో వాటిని క్లియర్ చేయడం కోసం ఈ రాయితీని ప్రకటించింది. ప్రభుత్వం ఇప్పటికే లక్షల చలాన్లు వసూలు అయ్యాయి. కాగా.. ఈ రాయితీల ద్వారా పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకోవడానికి మరో ఒక్క రోజు సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ఒక్కసారి తమతమ ట్రాఫిక్ చలాన్లను చెక్ చేసుకుని..ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు చెబుతున్నారు.
కాగా.. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్‌ను ప్రభుత్వం డిసెంబర్ 26వ తేదీ నుంచి అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. జనవరి 10వ తేదీతో ఈ ఆఫర్ ముగుస్తుంది. ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్ల వారికి పెండింగ్ చలాన్లపై 90 శాతం డిస్కౌంట్ కొనసాగుతోంది. ద్విచక్ర వాహనదారులకు అయితే 80 శాతం రాయితీ కల్పించారు. ఇక ఫోర్ వీలర్స్, ఆటోలకు 60 శాతం, లారీలతో పాటు ఇతర హెవీ వెహికిల్స్‌కు 50 శాతం డిస్కౌంట్‌ను ప్రకటించారు అధికారులు. అయితే.. డిసెంబర్ 25 తర్వాత పడిన చలాన్లకు మాత్రం ఎలాంటి రాయితీ వర్తించదని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతకు ముందున్న చలాన్లను మాత్రం అన్నింటినీ క్లియర్ చేసుకోవచ్చు.
గతంలో కూడా ప్రభుత్వం ఒకసారి పెండింగ్ చలాన్లపై రాయితీలను ప్రకటించింది. అప్పుడు ఇప్పటికంటే కాస్త తక్కువగానే రాయితీలు ఇచ్చారు. 2022 మార్చి 31 నాటికి 2.4 కోట్ల పెండింగ్ చలాన్లు ఉంటే.. రాయితీల ద్వారా అప్పుడు ఏకంగా రూ.300 కోట్ల వరకు చలాన్లు వసూలు అయ్యాయి. ఈ సారి కూడా 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్ ఉండటంతో మరోసారి ప్రభుత్వం రాయితీలు ప్రకటించింది. ఈ క్రమంలో మరోసారి ప్రభుత్వానికి చలాన్ల వసూలు ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే..రేపటితో చలాన్లు చెల్లించుకోలేకపోతే.. ఆ తర్వాత వందశాతం చలాన్లు చెల్లించాల్సి ఉంటుంది.