విషాదం.. తల్లిదండ్రులు కట్టిన ఉయ్యాలే.. ఆ చిన్నారి ఊపిరి తీసింది

One-year-old girl dies after swing gets tied to her neck. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అప్పటి వరకు ఉయ్యాలలో ఎంతో సంతోషంగా

By అంజి  Published on  30 Aug 2022 5:11 PM IST
విషాదం.. తల్లిదండ్రులు కట్టిన ఉయ్యాలే.. ఆ చిన్నారి ఊపిరి తీసింది

రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అప్పటి వరకు ఉయ్యాలలో ఎంతో సంతోషంగా ఆడుకున్న ఆ పాప ప్రమాదవశాత్తు మృతి చెందింది. ఆ చిన్నారి పాలిట ఉయ్యాలే ఉరితాడైంది. పాప ఆడుకుంటుందని తల్లిదండ్రులు ఉయ్యాల కట్టారు. అయితే అదే ఉయ్యాల తమ కూతురి ప్రాణాలు తీయడంతో తల్లడిల్లేలా రోదిస్తున్నారు. ఈ విషాదకర ఘటన గంభీరావుపేట మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దిలీప్‌ దంపతులకు ఏడాది వయసు గల పాప ఉంది.

పాప ఆడుకుంటుందని తల్లిదండ్రులు ఇంట్లో ఉయ్యాల కట్టారు. రోజులానే చిన్నారిని ఉయ్యాలలో వేసి తల్లిదండ్రులు తమ పనులు చూసుకునేవారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఉయ్యాలలో ఆడుకుంటుండగా.. అది కాస్తా పాప మెడకు బిగుసుకుపోయింది. దీంతో పాప ఊపిరాడక మృతి చెందింది. పక్క గదిలో ఉన్న కుటుంబ సభ్యులు గమనించగా పాప ఆపస్మారక స్థితిలో పడి ఉంది. కుటుంబసభ్యులు వెంటనే చిన్నారిని వైద్యం కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పాప చనిపోయిందని వైద్యులు వెల్లడించారు.

అప్పటి వరకు అందరితో గడిపిన చిన్నారి.. ఆడుకుంటూ మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Next Story