శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం.. గవర్నర్ కు ఫిర్యాదు
శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై గత కొద్దిరోజులుగా వివాదం కొనసాగుతూ ఉంది. తాజాగా భారత యాదవ సమితి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 8 Jun 2023 4:30 PM ISTశ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం.. గవర్నర్ కు ఫిర్యాదు
శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై గత కొద్దిరోజులుగా వివాదం కొనసాగుతూ ఉంది. తాజాగా భారత యాదవ సమితి (BYS) నేతలు తెలంగాణ గవర్నర్ ను ఈ విషయంపై సంప్రదించారు. దేవుళ్ల రూపంలో ఉన్న మానవ విగ్రహాలను తొలగించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను భారత యాదవ సమితి నేతలు కోరారు. ఈ మేరకు గురువారం గవర్నర్ కార్యాలయంలో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. బీవైఎస్ నేతలు మాట్లాడుతూ.. దేవుళ్ల రూపంలో ఉన్న మాన విగ్రహాలను తొలగించేలా దేశవ్యాప్తంగా ప్రత్యేక చట్టం తీసుకువచ్చేలా కృషి చేయాలని కోరారు. ఖమ్మంలో కృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయకుండా ఆపాలని, ఫిలింనగర్ ఫిలిం ఛాంబర్ దగ్గర శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని తొలగించాలని గవర్నర్‌ను బీవైఎస్ నేతలు కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో భారత యాదవ సమితి రాష్ట్ర అధ్యక్షులు దాసరి నాగేష్ యాదవ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ది రమేష్ యాదవ్, లీగల్ అడ్వైజర్ బోర్రాజు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర నాయకులు తోకల శ్రీనివాస్ యాదవ్‌లు ఉన్నారు.
ఖమ్మం జిల్లా కేంద్రంలోని లకారం ట్యాంక్‌బండ్ వద్ద శ్రీకృష్ణుడి రూపంలోఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. ఈ విగ్రహం శ్రీకృష్ణుడి రూపంలో ఉండటంతో పలు యాదవ సంఘాల సభ్యులు, పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆదిభట్ల శ్రీకళాపీఠం, భారత యాదవ సమితి కోర్టుకు వెళ్లారు. టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి కూడా ఈ విషయమై తన అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం పెద్ద దుమారానికి కారణమైంది.