'పిల్లలకు కావాలి భోజనం-సబిత ఇచ్చింది మరణం'..మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి వద్ద NSUI నిరసన
NSUI Leaders Round Up Minister Sabitha Indra Reddy house.విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిముట్టడికి ఎన్ఎస్‌యూఐ
By తోట వంశీ కుమార్ Published on 28 July 2022 2:09 PM ISTవిద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి ఎన్ఎస్‌యూఐ(NSUI) నేతలు యత్నించారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఈ నెల 15న పుడ్ పాయిజన్ అయిన సంగతి తెలిసిందే. చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పీయూసీ రెండవ సంవత్సరం చదువుతున్న వరంగల్‌కి చెందిన సంజయ్ కిరణ్ చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మరణించాడు. కిరణ్ మరణానికి బాసర ఐఐఐటి పై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్లక్ష్యమే కారణమని గురువారం తెలంగాణ ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బల్మూరి ఆధ్వర్యంలోని బృందం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు.
"Student-Killer KCR","పిల్లలకు కావాలి భోజనం-సబిత ఇచ్చింది మరణం","అమ్మ అన్నావు అన్యాయం చేసావు" అనే ప్లకార్డులతో నిరసన చేపట్టారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు పోలీసులు ఎన్ఎస్‌యూఐ బృందాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని గోషామహల్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం ఆరంభం నుంచే ప్రభుత్వ గురుకుల పాఠశాలల ఫుడ్ కాంట్రాక్టర్ల కమిషన్ల ఆరాటంతో, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల బాసర ఐఐఐటి అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన ప్రభుత్వ గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు కలుషిత ఆహారం వల్ల ఫుడ్ పాయిజన్ కి గురై ఆసుపత్రుల పాలు అయ్యారన్నారు. ఈ విషయమై ఎన్ఎస్‌యూఐ ఎన్ని సార్లు ప్రయత్నించిన విద్యా శాఖ మంత్రి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. కనీసం సదరు కాంట్రాక్టర్ల మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.
మంత్రి నిర్లక్ష్యం వల్ల రెండు రోజుల క్రితం వరంగల్ కి చెందిన బాసర ఐఐఐటి విద్యార్థి సంజయ్ కిరణ్ హాస్టల్ మరణించారన్నారు. సంజయ్ తల్లిదండ్రులు అతడిని కాపాడుకునేందుకు 10 రోజుల వ్యవధిలో రూ.14లక్షలు ఖర్చు చేశారని అయినప్పటికి అతడిని కాపాడుకోలేకపోయారని తెలిపారు. విద్యా శాఖ మంత్రి తన సొంత నియోజకవర్గ కార్యమాలు వీడి ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎదురుకుంటున్న సమస్యలను ఇప్పటికైనా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించే వరకు తాము ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు.