నాగార్జున సాగర్ లో మరోసారి గులాబీ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్.. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై 18,449 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నల్లగొండలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రాంగణంలో కౌంటింగ్ నిర్వహించారు. రెండు హాళ్లల్లో ఏడు టేబుళ్ల చొప్పున మొత్తం 14 టేబుళ్లపై లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో 25 రౌండ్లుగా లెక్కింపు చేపట్టారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చాయి.
ఇక వరుసగా తొలి తొమ్మిది రౌండ్లలో నోముల భగత్ ఆధిక్యం ప్రదర్శించారు. 10,11,14 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి ఆధిక్యం కనబరిచారు. మిగితా రౌండ్లలో మాత్రం టీఆర్‌ఎస్ ముందుంది. ఇక కాంగ్రెస్‌కు 59, 239 ఓట్లు, బీజేపీకి 6,365 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి రెండో స్థానానికి పరిమితం కాగా, బీజేపీ అభ్యర్థి రవి నాయక్ డిపాజిట్ గల్లంతు అయింది. టీఆర్ఎస్ సర్కార్‌ను బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎంతగా విమర్శించినప్పటికీ.. మరోమారు కేసీఆర్ పార్టీకే ఓటర్లు మొగ్గుచూపడం గమనార్హం.