నిధులు రాలేద‌ని.. బ‌డికి తాళం

No funds no badi Karimnagar's Chintakunta primary school shut over unpaid bills.చింతకుంటలోని మండల పరిషత్ ప్రాథమిక

By తోట‌ వంశీ కుమార్‌  Published on  13 Sep 2022 5:28 AM GMT
నిధులు రాలేద‌ని.. బ‌డికి తాళం

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంటలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సెప్టెంబర్ 6న మూసివేశారు. దీంతో పాఠశాలలోని 250 మంది విద్యార్థులు త‌మ త‌ర‌గ‌తి గ‌దుల్లో కాకుండా బయట కూర్చోవలసి వచ్చింది. వారిలో చాలా మంది అక్క‌డ ఏం జ‌రుగుతుందనే విష‌యాన్ని అర్థం చేసుకోలేని చిన్న పిల్ల‌లు కావ‌డం గ‌మ‌నార్హం.

పాఠ‌శాల మూసివేత‌కు ప్ర‌ధాన కార‌ణం తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయకపోవడమే. 'మన ఊరు మన బడి' కార్యక్రమం కింద పాఠశాల ఉన్నప్పటికీ పైసా కూడా అందలేదని పాఠశాల అధికారులు చెబుతున్నారు.

మౌలిక సదుపాయాలు, సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 26,000 పాఠశాలల్లో 'మన ఊరు మన బడి' కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే.. చాలా పాఠశాలలు ప‌నులు చేప‌ట్టిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం నుంచి నిధులు అంద‌లేద‌నే ఫిర్యాదులు చేస్తున్నాయి.ఇక‌, చింతకుంట ఎంపీపీఎస్‌లో 1 నుంచి 5వ తరగతి వరకు 250 మంది విద్యార్థులు చదువుతుండగా.. ఐదు తరగతులకు గానూ ఐదు తరగతి గదులు ఉన్నాయి. పాఠ‌శాల‌లో మౌలిక‌ స‌దుపాయాల‌ను మెరుగుపర‌చ‌డానికి పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రూ.4.5 ల‌క్ష‌లు ఖ‌ర్చుచేశారు. ఇందులో రూ. 3.5 లక్షలు తన జేబులోంచి, మిగిలిన మొత్తాన్ని స్నేహితులు, సన్నిహితుల వద్ద అప్పుగా తీసుకున్నాడు. ఈ మొత్తంతో పాఠశాలలో నీటి పంపు, విద్యుత్తు పనులు పూర్తి చేశాడు.

పాఠశాలలోని వాష్‌రూమ్‌ను బాలికలందరూ వినియోగించుకునేలా.. నాణ్యమైన సిమెంట్‌తో పాటు మంచి మరుగుదొడ్లు నిర్మించినట్లు శ్రీకాంత్‌ తెలిపారు. కానీ తాను సేకరించిన నిధులతో ఎక్కువ కాలం పాఠశాలను నడపలేనని అర్థమైంది. అలాగే.. అప్పుగా తెచ్చిన డ‌బ్బ‌ను తిరిగి చెల్లించాల్సి ఉంది. తన వద్ద తగినంత నిధులు లేవని, ఇక పాఠశాలను నడపలేడని తెలుసుకున్న శ్రీకాంత్ సెప్టెంబర్ 6న తరగతి గదులకు తాళం వేశాడు.

కాగా.. సెప్టెంబర్ 7న అతను పాఠశాలకు తాళాలు వేస్తున్న వీడియో ట్విట్టర్‌లో కనిపించింది. వీడియోలో.. కొంద‌రు విద్యార్థులు వరండాలో నిల‌బ‌డగా.. మ‌రికొంద‌రు చెట్ల నీడలో కూర్చున్నారు.

దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నారాయణస్వామి మాట్లాడుతూ.. పాఠశాలను గంటపాటు మూసి ఉంచారని, అనంతరం మండల విద్యాధికారి (ఎంఈవో), జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) పాఠశాలను సందర్శించారని తెలిపారు. ఒక గంట తర్వాత పాఠశాల పునఃప్రారంభమైన‌ట్లు చెప్పారు. సెప్టెంబర్ 9న పాఠ‌శాల‌కు ప్రభుత్వం రూ. 25,000 నిధుల‌ను విడుద‌ల చేసింది.

కొత్తపల్లి MEO మరియు కరీంనగర్ DEO లను న్యూస్‌మీటర్ సంప్రదించడానికి ప్రయత్నించింది. కాని మా కాల్‌లకు ఇద్దరూ స్పందించలేదు. వారి స‌మాధానం తెలుసుకున్న త‌రువాత అప్‌డేట్ చేస్తాము.

Next Story
Share it