నిజామాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న నిజామాబాద్ అర్బన్ స్వతంత్ర అభ్యర్థి యమగంటి కన్నయ్యగౌడ్ సాయినగర్‌లోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. రెండు రోజుల్లో గృహప్రవేశం ఉండగా ఇంతలోనే కన్నయ్య ఆత్మహత్య చేసుకోవడంతో విషాదం నెలకొంది. లోన్ యాప్ వేధింపుల వల్లే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నాయకుడు అవుతాడని భావించిన వ్యక్తి కానరాని లోకాలకు వెళ్తాడనుకోలేదు అని కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు గురవుతున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అభ్యర్థిగా నిలబడిన కన్నయ్య ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. కాగా ఈ ఘటన ఎన్నికల వేళ స్థానికంగా కలకలం రేపింది. కన్నయ్య గౌడ్ స్వతంత్ర్య అభ్యర్థిగా నామినేషన్ వేయగా.. అతడికి ఎన్నికల సంఘం రోటీ మేకర్‌ని ఎన్నికల గుర్తుగా కేటాయించింది.