Telangana: తల్లి అంత్యక్రియల కోసం చిన్నారి భిక్షాటన
తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేక ఓ చిన్నారి భిక్షాటన చేసిన హృదయవిదారక ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది.
By అంజి Published on 18 Aug 2024 6:00 PM ISTTelangana: తల్లి అంత్యక్రియల కోసం చిన్నారి భిక్షాటన
తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేక ఓ చిన్నారి భిక్షాటన చేసిన హృదయవిదారక ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. తానూర్ మండలం బెళ్తరోడాకు చెందిన గంగామణి (36) భర్తకు దూరంగా ఉంటూ కూతురు దుర్గను పోషిస్తోంది. కూలిపనులు చేసుకుంటూ కూతురు దుర్గను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలకు పంపి చదివిస్తోంది. కొన్ని రోజుల క్రితం భర్త మృతి చెందాడు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపం చెందిన గంగామణికి ఆర్థిక ఇబ్బందులు కూడా తోడవడంతో ఉరి వేసుకుంది. ఇంట్లో డబ్బులు లేకపోవడం, తల్లి అంత్యక్రియలు ఎలా చేయాలో తెలియక చిన్నారి దుర్గ.. తన ఇంటి ముందు ఓ గుడ్డ వేసుకుని అంత్యక్రియలకు సాయం చేయాలని అక్కడున్న వారిని వేడుకుంది.
బంధువులు ఉన్నా ఆర్థికంగా ఎలాంటి సాయం చేయకపోవడంతో చిన్నారి దుర్గ తప్పని పరిస్థితుల్లో భిక్షాటన చేపట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో దాతలు స్పందించి సహాయం అందిస్తున్నారు. అటు తల్లి అంత్యక్రియలకు డబ్బులు లేని దుస్థితిలో సాయం చేయాలన్న అనాథ చిన్నారి విజ్ఞప్తికి గ్రామస్తులు తోచిన సాయం చేస్తున్నారు. కాగా ఈ ఘటన స్థానికులను కలచివేసింది. కాగా గంగామణి ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.