హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవేపై ప్రయాణించే వాహనదారులకు గుడ్‌న్యూస్. ఈ హైవేపై టోల్ ఛార్జీలను తగ్గిస్తూ నేషనల్ హైవేస్ ఆథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. తగ్గిన టోల్ ఛార్జీలు నేటి అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. హైదరాబాద్ - విజయవాడ నేషనల్ హైవే 65పై చౌటుప్పల్ మండలం పంతంగి, కేతేపల్లి మండలం కొర్లపహాడ్, చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలు ఉన్నాయి.
పంతంగి టోల్ వద్ద కార్లు, వ్యాన్‌లు, జీపులకు ఒక వైపు ప్రయాణానికి రూ.15, రెండు వైపులా ప్రయాణానికి కలిపి రూ.30, లైట్ వెయిల్ గూడ్స్ వాహనాలకు ఒక వైపు ప్రయాణానికి రూ.25, ఇరువైపులా కలిపి రూ.40, ట్రక్కు, బస్సులకు ఒక వైపు ప్రయాణానికి రూ.50, ఇరువైపులా కలిపి రూ.75కి తగ్గించారు.
అయితే ఏపీలోని చిల్లకల్లు వద్ద అన్ని వెహికల్స్‌కు ఒకవైపు రూ.5, రెండు వైపులా కలిపి రూ.10 చొప్పున మాత్రమే తగ్గించారు. 24 గంటల్లోగా తిరుగు ప్రయాణం చేస్తే టోల్ ఛార్జీలో 25 శాతం మినహాయింపు ఉంటుంది. ఈ తగ్గించిన ధరలు 2026 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. హైదరాబాద్ - విజయవాడ హైవేపై టోల్ ప్లాజాల వద్ద 2012 డిసెంబర్ నుండి టోల్ వసూళ్లు ప్రారంభం అయ్యాయి. గతేడాది వరకు టోల్ వసూళ్లను జీఎంఆర్ సంస్థ చేపట్టగా.. ఇప్పుడు ఎన్‌హెచ్‌ఏఐ ఏజెన్సీల ద్వారా టోల్ వసూలు చేస్తోంది.