తెలంగాణ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు.. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ఎన్‌జీటీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ (ఫోర్త్ సిటీ) ప్రాజెక్టు పనులపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్...

By -  అంజి
Published on : 8 April 2026 10:51 AM IST

Future City Project, National Green Tribunal (NGT), Fourth City Hyderabad, Environmental Clearances, FCDA, Telangana Government, D. Narasimha Reddy, NGT Chennai Bench

తెలంగాణ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు.. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ఎన్‌జీటీ

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఫ్యూచర్ సిటీ’ (ఫోర్త్ సిటీ) ప్రాజెక్టు పనులపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ నిరాకరించింది. అయితే, ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ నిబంధనల అమలుపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంతో పాటు ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA)కి ఎన్‌జీటీ నోటీసులు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు లేకుండానే ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందని సామాజిక కార్యకర్త డి. నరసింహారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ట్రిబ్యునల్ ఈ మేరకు స్పందించింది.

శ్రీశైలం, నాగార్జునసాగర్ హైవేల మధ్య సుమారు 30,000 ఎకరాల్లో నివాస, వాణిజ్య, పారిశ్రామిక హబ్‌గా ఈ నగరాన్ని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అయితే, పర్యావరణ అనుమతులు రాకుండానే టెండర్లు పిలుస్తున్నారని, తక్షణమే పనులను నిలిపివేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. కేంద్ర పర్యావరణ నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతులు లేకుండా ఇటువంటి భారీ ప్రాజెక్టులను చేపట్టడం చట్టవిరుద్ధమని ఆయన ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు.

ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ పిటిషన్ అపరిపక్వమైనదని పేర్కొన్నారు. ప్రాజెక్టు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, క్షేత్రస్థాయిలో ఎటువంటి అభివృద్ధి పనులు మొదలుకాలేదని ఆయన స్పష్టం చేశారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం సరైన సమయంలో అన్ని పర్యావరణ అనుమతులు పొందుతామని ప్రభుత్వ పక్షాన హామీ ఇచ్చారు. ప్రభుత్వ వివరణను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ పుష్ప సత్యనారాయణ, డాక్టర్ సత్యగోపాల్ కోర్లపాటిలతో కూడిన బెంచ్, ప్రస్తుతానికి స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేస్తూ, అప్పటిలోపు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది.

Next Story